నిన్న ఆమె నీ గుండెగుడిలో
వెలసిన ఓ అందమైన దేవత
నిన్న ఆమె అందం
మత్తెక్కించే మకరందం
నిన్న ఆమెతో బంధం
జన్మజన్మల అనుబంధం
నిన్న ఆమె అందిన
ఒక తియ్యని ద్రాక్ష
నిన్న ఆమె స్పర్శలో
ఎంతో పులకింతఏదో గిలిగింత
నిన్న ఆమె చేసిన బాసలు
చెప్పిన ఊసులు
చెక్కుచెదరని శిలాక్షరాలు
నిన్న ఆమె నీ దేహదాహం
తీర్చిన దేవకన్య
ఆమె చూపు రూపు అపురూపం
మరి ఇప్పుడేమైంది ?
చెక్కెర చెదైంది...తేనె విషమైంది
ప్రేమ దోమైంది...పెళ్లి గిల్లైంది
ప్రియుడే పిశాచిగా మారాడు
నిన్న "ప్రేమ ప్రేమ" అంటూ
పిచ్చికుక్కలా వెంటబడి తిరిగి
నేడు "కాదు" అన్న నేరానికి
కడుపులో అంతులేని కక్ష పెంచుకుని
తెల్లవన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని
నమ్మే అన్యంపుణ్యం ఎరుగని
ఏ పాపంపుణ్యం తెలియని
అమాయకపు అబలల్ని
కాసింతైనా కరుణ దయ జాలి
కనికరం లేకుండా ఘోరంగా
క్రూరంగా అతిదారుణంగా
మానవమృగాలుగా మారి
కత్తులతో పొడిచే...
కడవళ్ళతో కోసే...
గొడ్డలితో నరికే...
యాసిడ్లతో దాడిచేసే...
నరరూపరాక్షసులకు నలుగురిలో
నడిరోడ్డుకూడలిలో ఉరే సరైనశిక్ష
అదే చట్టమైతే స్త్రీలందరికీ శ్రీరామరక్ష



