నేడు యువత భవిత
ప్రశ్నార్ధకమౌతుంది
నేటి యువత "ప్రేమపాఠాలే"...
రేపటిరోజు తల్లిదండ్రులకు
గుండెలు రగిలే పగిలే
"గుణపాఠాలౌతున్నాయి"...
అందుకే ఓ వయసా ! నీకు వందనం !
మాతృత్వానికి మానవత్వానికి
మచ్చతెచ్చే "వికృత చేష్టలు
వింత వింత మనస్తత్వాలు"
తల్లీ దండ్రుల "పెంపకానికి
పెనుసవాళ్లు" విసురుతున్నాయి
అందుకే ఓ వయసా ! నీకు వందనం !
మొన్న పెళ్లిళ్లు
పెటాకులైతే...
కానీ నేడు ప్రేమలే
విడాకులౌతున్నాయి...
పీటల వరకు రాకుండానే
పీకలు తెగిపోతున్నాయి...
నూకలు చెల్లిపోతున్నాయి...
నూరేళ్లు నిండిపోతున్నాయి...
అందుకే ఓ వయసా ! నీకు వందనం !
నేడు చిగురించిన ప్రేమలే
మూడుముళ్లు పడకముందే
ఏడడుగులు నడవక ముందే
పగాప్రతీకారాలతో రక్తసిక్తమౌతున్నాయి
అందుకే ఓ వయసా ! నీకు వందనం !
మంగళతోరణాలతో
మంగళవాయిద్యాలతో
పచ్చని పెళ్లిపందిరిలో
కళకళలాడే కళ్యాణశోభకు ముందే
మృత్యువు మృదంగనాదం వినిపిస్తూంది
కామంతో నిండిన కల్తీప్రేమ కసితో పండిన
పిచ్చి ప్రేమ పాడెమీద ఊరేగుతుంది
అందుకే ఓ వయసా ! నీకు వందనం !



