Facebook Twitter
కదలని చెట్టు కనిపించని దైవం రెండూ ఒక్కటే ఎలాగ?...

దైవమూ ఒక చెట్టే కారణం
చెట్టు ఉన్నచోటు నుండి
కదలదు పిలిస్తే పలకదు
చెట్టుపైన ఎవరు చెట్టుకింద ఎవరు వున్నారో
ఎవరు తన ఫలాలను తిన్నారో తనకు తెలియదు
చెట్టుకు తనను ఆశ్రయించిన వారిని
ఆదరించడం, ఆకలి తీర్చడం మాత్రమే తెలుసు

తనను చెక్కిన వాడికే తప్ప
తనకు మొక్కేవారికి తాను ఒక రాయి
అన్న నగ్నసత్యం తెలియకూడదని
సుందరశిల్పంగా మారిన దైవాన్ని
చక్కని పట్టువస్త్రాలతో
ఖరీదైన బంగారు ఆభరణాలతో
అలంకరిస్తారు పూజలు చేస్తారు
పూలపల్లకిలో ఊరేగిస్తారు

ఎంత పిలిచినా పలకని, నోరున్నా మాట్లాడని,
కళ్ళున్నా చూడని, చెవులున్నా వినని
కాళ్ళున్నా కదలని, దేవుడు ఒకరాయని తెలిసినా భక్తులు భయంతో భక్తితోగట్టి నమ్మకంతో
ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు చేస్తారు
ఆశతో ఆరాధిస్తారు

నిజమే చెట్టు కదలకపోయినా
ఆ చెట్టు ఫలాలు నీ ఇల్లుచేరి
నీ ఆకలి తీర్చినట్టు
దైవం కూడా కదలకపోయినా
కనిపించకపోయినా నీ ప్రార్థనలు విని
నీ వెంటే వుండి నీపై కోటిదీవెనలు కుమ్మరించి
నీవు కోరిన కోర్కెలన్నీ తీర్చి
నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచి
నిన్ను ఎవరూ ఊహించనంతగా
ఉన్నత శిఖరాలపైకి చేరుస్తాడు
కదలని చెట్టు కనిపించని దైవం రెండూ ఒక్కటే
అందుకే
కష్టపడి చెట్టును పెంచితే
ఖచ్చితంగా ఫలాలు దక్కుతాయి
భక్తితో భగవంతున్ని సేవిస్తే
అద్భుతమైన వరాలు అందుతాయి