ఓ కవి శ్రేష్టులారా..!
కదిలించే కనువిప్పు కలిగించే
గుండెలను పిండే మీ కవిత్వం
మండే కడుపులో నుండి...
ఆర్పని కనురెప్పల నుండి...
నీటిచుక్కలై...నిప్పురవ్వలై...పుట్టాలి
ప్రతిమనిషి గుండెతలుపుల్ని...తట్టాలి
సమాజ పరివర్తనకు...
సామాజిక శ్రేయస్సుకు...
కష్టజీవుల కన్నీటి బ్రతుకుల్లో
కాంతిరేఖలకోసం శ్రీకారం...చుట్టాలి...
విజేతలై జేగంట...కొట్టాలి...
విశ్వ శాంతి గీతం ఆలపించాలి
మానవత్వపు మార్పుకై మీరు
తూర్పు వైపుకు పయనించాలి
ఆ తూర్పుకు మీ పేరే...పెట్టాలి...
ఓ కవి శ్రేష్టులారా..!
నిన్న బానిసత్వపు
సంకెళ్లను త్రెంచిన
మీ కవిత్వం ఇక కాళిలా
కళ్ళు తెరిచి కత్తిని దూసి
పులిలా ముందుకు దూకాలి
ఇకపై మీ కవిత్వం...విత్తనమై
మట్టిని చీల్చుకుని రావాలి
మర్రి వృక్షంలా మారిపోవాలి
ఎందరికో చల్లని నీడనివ్వాలి
గాఢాంధకారంలో గబ్బిలాలవలె
గోడలకు వ్రేలాడుతూ మొద్దుల్లా
గానుగెద్దుల్లా గాఢనిద్రలో వున్న
పిరికి పందల్ని కొరడాలతో కొట్టాలి
భుజం తట్టి వెన్ను తట్టి
పరుగులు పెట్టించాలి మీ కలాలు
అగ్నిగోళాలవలె భగ్గున మండాలి
కవితా శిల్పసుందరిని ఉక్కు సంకల్పం ఉలితో చెక్కి ఊహలఊయలలో ఊరేగే
ఓ అమరశిల్పి జక్కన్నలారా...
మరో ఆధునిక భారతాన్ని వ్రాసే
ఓ అభినవ నన్నయ్య తిక్కన్నలారా...
నేడు నివురు కప్పినదేదైనా
రేపు ఒక...విస్ఫోటనమేనని...
అది బ్రద్దలయ్యే అగ్ని పర్వతమేనని... మండుతూ ఎగిసిపడే...ఎర్రని లావేనని...
తెలుసుకోండి నిజమొక చేదుగుళికేనని...
ఓ కవిశ్రేష్టులారా..!
మీ కలాలు మరఫిరంగులై పేలాలి
ఈ శిధిల ప్రపంచాన్ని పునర్మించాలి
మీ భావాలు గుండెల్లో గుచ్చుకోవాలి
మీ కవిత్వం చెంప చెళ్ళుమనిపించాలి
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు...సమానత్వం సౌభ్రాతృత్వపు పునాదుల మీద
మీరు నవసమసమాజాన్ని స్థాపించాలి...
కొత్త బంగారులోకాన్ని మీరు సృష్టించాలి...
అమ్మ బాబోయ్ వచ్చేస్తున్నాయ్..!
అమ్మ బాబోయ్ వచ్చేస్తున్నాయట..!
గుడ్లగూబలు...
గుంటనక్కలు...
కులం గజ్జి కుక్కలు...
గోడమీది పిల్లులు...
గోముఖ వ్యాఘ్రాలు...
దోపిడీ దొంగలు...కొల్లేటి కొంగలు...
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...
నీ ఆత్మసాక్షిగా...
నీ ఆయుధాలు నీవు ధరించి...
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...
నీళ్ళను పాలను వేరుచేసే హంసలా...
విలువైన నీ ఓటును
విజ్ఞతతో విచక్షణతో వేయాలి...
రేపు నీకు పగటిపూటే
చుక్కలు చూపించే
ఆ "అవినీతి అనకొండలకు"
ఆ "అడవి పందికొక్కులకు"
నీవు చుక్కలు చూపించాలి
అందుకే అన్నా..! ఓ ఓటరన్నా..!
నీవు ఓడరాదు..! నీ ఓటు ఓడపోరాదు..!
