ఏ కళ్ళు చూసినా
ఆగని కన్నీటి ధారలే
ఏడ్చి ఏడ్చి ఎండిపోయి
కన్నీళ్ళకు బదులు రక్తం
ప్రవహిస్తున్నదాఖలాలే
ఏ గుండెల సవ్వడివిన్నా
లోన రగిలే అగ్నిపర్వతాలే
అద్దాలలా పగిలి ముక్కలు
ముక్కలైన హృదయాలే
ఏ చూపులు చూసినా
నిప్పుఖణికలే వేడినిట్టూర్పులే
ఆపన్నహస్తాలకోసం అర్థింపులే
ఆదుకోమని యుద్ధం ఆపమని
ఆశతో కన్నీటితో వేడుకోవడాలే
రేయింబవళ్ళు ప్రార్థించడాలే
ఏ పాదాలు చూసిన
బిక్కుబిక్కుమంటూ
ప్రాణభయంతో పిల్లాపాపలతో
ఉరుకులు పరుగులు పెడుతున్నవే
ఏ వైపు చూసినా
శిధిలమైన అందమైన భవనాలే
చిధ్రమైన మానవ అవయవాలే
కొనవూపిరితో కొట్టుకులాడుతువున్న
బాధితుల ఆక్రందనలే...హాహాకారాలే
ఔను రష్యా ఉక్రేనియన్ ల యుద్దం
భీభత్సం భీకరం భయంకరం ప్రాణాంతకం
ఉక్రెయిన్లపై ఉక్కుపాదం మోపి
భీకరమైన బాంబుదాడులతో
రష్యా చేసే
ఈ దండయాత్రను...
ఈ దురాక్రమణను...
ఈ దారుణమారణ కాండను...
అగ్రరాజ్యాలు అడ్డుకోలేవా?
ఆకలికి అలమటించే
ఆ ఉక్రేనియన్లను
ఆదుకోలేవా?
అక్కున చేర్చుకోలేవా?
ఆ యుద్దోన్మాదికి బుద్ది చెప్పలేవా?
ఈ రాక్షసత్వాన్ని
ఈ రక్తపాతాన్ని ఆపలేవా?
ప్రేక్షకపాత్ర వహించుట
ప్రపంచదేశాలకు తగునా?



