సర్వరుచుల
సమ్మేళనంతో
వడివడిగా వంటలు చేసి
ప్రక్కనే కూర్చొని చక్కగా
ప్రేమతో కొసరి కొసరి వడ్డించేది..!
అడిగిన తడవే
"ఆహ ఉహూ" అని
అడ్డు చెప్పక...పగలు రేయి
పడక గదిలో...పరవశింపచేసేది..!
చీదరించుకోక...
చిరుబురులాడక...
"అతిధిదేవుళ్ళను" ఆదరించేది..!
వినయ విధేయతలతో
"అత్తమామలను" గౌరవించేది....!
చిక్కు సమస్యలెదురైతే...
సమయస్ఫూర్తితో
చక్కని సలహాలనిచ్చేది..!
సహనంతో సర్దుకుపోయేది..!
కష్టాలలో కన్నీరు కార్చక...
చిక్కుల్లో చీకాకు పడక...
చిరునవ్వులు చిలకరించేది..!
చిలిపిగా కవ్వించి కడుపుబ్బ నవ్వించేది..!
పతినే "ప్రత్యక్ష దైవంగా"
భావించేది..! భక్తితో ఆరాధించేది..!
అనుదినం "భర్తను" తనివితీర "
అనురాగామృతంతో " అభిషేకించేది..!
కనిపించే ఒక దేవత...
ఐతే "ఆమే" మీ శ్రీమతి...
ఆమె మీకొక "బంగారు బహుమతి"
చక్కగా సాగిపోయే మీ
"సంసార నౌకకు" ఆమె"చుక్కాని"వంటిది.



