Facebook Twitter
గుట్టు చప్పుడు కాకుండా వచ్చే గుండె జబ్బు..!

అయ్యో..! అయ్యో..!
ఎంత ఘోరం..! ఎంత ఘోరం..!

గుట్టు చప్పుడు కాకుండా
వచ్చే ఆ మాయదారి గుండెజబ్బు
మృత్యువును వెంటబెట్టుకొనివస్తుంది

క్షణంలో అరక్షణంలో కళ్ళముందరే మనుషులను మాయం చేస్తుంది... మటుమాయమైపోయేలా చేస్తుంది...
తెగని బంధాలన్నీ తెంచేస్తుంది
గుండెల్లో గునపాలు గుచ్చేస్తుంది
రక్తసంబంధాలను రంపంతో కోసేస్తుంది

క్షణం వరకు సజీవంగా తిరిగే
తినే మాట్లాడే నవ్వే మనిషిని
నిలువునా నేలమీద విసిరేస్తుంది
నిర్జీవంగా మార్చేస్తుంది...

నీవు ఆర్జించి నీ కోట్లు
నివ్వెర పోయి చూస్తాయి...
తమ యజమాని ప్రాణాలను
కాపాడలేక పోయామేనని
కుళ్ళి కుళ్ళి ఏడుస్తాయి...

నీ కళ్ళ ముందరే
నీ బంధువులు...
నీ భార్య పిల్లలు...
నీ శ్రేయోభిలాషులు...
నీ ప్రాణ స్నేహితులు...
ఎందరున్నా ఏమీ చేయలేని
నిస్సహాయస్థితిలో ఉండిపోతారు...
దిక్కుతోచక బిక్కచచ్చి పోతారు...

గుండెలు బాదుకొని
దిక్కులు పిక్కటిల్లేలా...
వెక్కి వెక్కి ఏడవడం తప్ప...
ఏమీ చేయలేని దీనస్థితిలో
దిక్కులు చూస్తూ ఉండిపోతారు...

అందుకే ఎప్పుడైనా...
రోజుకు ఒక్కసారైనా...
మనకు జన్మనిచ్చిన
ఆ అమ్మానాన్నలను...
మనకు ప్రాణం పోసిన
కనిపించని ఆ బ్రహ్మను... 
ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి...
సదా మనసులో స్మరించుకోవాలి...

వచ్చే
ఊహించని
కష్టాలను నుండి...
ముందున్న
పెను ప్రమాదాలనుండి...
తప్పించమని...రక్షించమని
కరుణించమని ....
కంటికి రెప్పలా కాపాడమని...

అడుగడుగునా
గండాల నుండి...
సుడిగుండాల నుండి...
చుట్టుముట్టి మట్టుపెట్టే...
భయంకరమైన సునామీల నుండి...
సురక్షితంగా బయట పడవేయమని...

పదికాలాల పాటు పిల్లాజల్లతో
కలిసి చల్లగా హాయిగా ఆనందంగా
సంతోషంగా ఉండేలా చూడమని...
ఆశతో అర్థించాలి...పేరాశతో ప్రార్థించాలి...