ఓ చెల్లీ..! నా బంగారు తల్లీ..!!
నీ చుట్టూ కోతులుంటాయి
కొండముచ్చులుంటాయి
గజ్జికుక్కలుంటాయి
గుంటనక్కలుంటాయి...జాగ్రత్త...
నల్లవన్నీ నీళ్ళని తెల్లవన్నీ పాలని
తొందరపడి...అందరినీ నమ్మకు...
నవ్వుతూ నట్టేటముంచే
నయవంచకులుంటారు
జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త..!
నిన్ను పొగిడి పొగిడి
నీకు మత్తెక్కిస్తారు నిన్ను
మైకంలో ముంచేస్తారు
కీలుబొమ్మను చేసి
ఆటలాడిస్తారు జాగ్రత్త..!
నీ మంచితనానికి ...
నీ అమాయకత్వానికి
నీ బలహీనతలకు నిన్ను
బలిచేస్తారు తస్మాత్ జాగ్రత్త..!
అందుకే ఓ చెల్లీ..! నా బంగారు తల్లీ..!
మారకు మారకు..!
నిన్ను అవసరాలకు వాడుకునే
ఆ టక్కరి నక్కల చేతిలో
ఒక ఆటబొమ్మగా మారకు..!
ఎవరెంతగా ప్రలోభపెట్టినా
ఎవరెన్ని ఊరించి ఊరించి
మాయమాటలు చెప్పినా
ఎన్ని కుళ్ళు జోకులు వేసినా
పళ్లు ఇకిలించి పకపకమని
నడిరోడ్డులో...నవ్వకు... నవ్వకు
నలుగురిలో చులకనైపోకు..!
ఎవరినీ నమ్మకు నమ్మకు...
నమ్మినా కాసింత నిఘా పెట్టివుండు
ఎవడు దొంగో ఎవడు దొరో
అది నీవిచ్చిన "అతిచనువుకే "ఎరుక..!
ఎవడు పచ్చి మోసగాడో..?
ఎవడిలో ఏ దుర్బుద్ది ఉందో..?
ఎవడి మనసులో ఏ కల్మషముందో..?
ఎవడు ఏ దారుణానికొడిగడతాడో..?
ఏపుట్టలో ఏ పాముంటుందో ఎవరికెవరు..?
అది నీవిచ్చిన "అతి చనువుకే "ఎరుక..!
అందుకే ఓ చెల్లీ..!నా బంగారు తల్లీ..!
గుర్తుంచుకో...జీవితాంతం
"అతిచనువు"...ఒక మానసిక శిక్షయని"...
"అది నీ శీలానికి...ఒక అగ్ని పరీక్షయని"...



