ఎవరు...?ఎవరు..?
ఆకలేస్తే...కేకలేస్తే వచ్చి
ఆకలి తీర్చినవారా..?
ఔను...వారే మన మిత్రులు...
ఎవరు...?ఎవరు..?
అవసరమొస్తే...ఆపదవస్తే
ఆర్థికంగా ఆదుకున్నవారా..?
ఔను...వారే మన అభిమానులు...
ఎవరు..?ఎవరు..?
బరువు బాధ్యతల భారం మోయలేక
సమస్యల సుడిగుండంలో చిక్కినవేళ
చెంతకుచేరి చింతలు తీర్చినవారా...?
ఔను...వారే మనకు ఆత్మీయులు...
కాని...
మన నిజమైన ప్రాణమిత్రులు...
మన నిజమైన వీరాభిమానులు...
మన నిజమైన ఆత్మీయులు ఎవరు..?
ఎవరంటే...
కందిపోయి బొబ్బలెక్కిన
మన అరచేతిలో దాగిన కష్టాన్ని...
ఆ కష్టం వెనుక...ఎరుపెక్కిన కళ్ళ
కనురెప్పల మాటున కనిపించక
జలజలజారే ఆ కన్నీటి ధారల్ని...
మన మనసు పొరల్లో...గంగలా
పొంగేటి ఆ పుట్టెడు దుఃఖాన్ని ...
మన చిరునవ్వుల వెలుగుల...
వెనుక దాగిఉన్న ఆ చిమ్మచీకటిని...
మన మాటల్లో దాగిన మర్మాన్ని...
ఆరని ఆవేదనా చితిమంటల్ని...
మన గుప్పెడు గుండెల్లో...
గూడుకట్టుకున్న ఆ క్షోభను ఆ బాధను
ఆ వ్యధను ఆ ఆవేదనను గుర్తించినవారే...
మన గుండెలోతుల్లోకి తొంగి చూసినవారే...
వారే మనకు నిజమైన ఆత్మీయులు ...
వారే మనకు నిజమైన ఆత్మ బంధువులు...
వారే వారే ఆ పరమాత్మకు ప్రతిరూపాలు...
అట్టివారికిచేద్దాం వందనం పాదాభివందనం.



