మనసు మనసు
ఏకమైతే ఒక లోకమైతే...
ఇక మ్రోగేది "మంగళ వాయిద్యాలే"...
ద్వారాల నిండా "మంగళ తోరణాలే"...
ఇంటినిండా..."పచ్చని మామిడాకులే"...
కనువిందు కలిగించే
కల్యాణ వేదికలే...
పెనవేసుకుపోయేది
అనురాగబంధాలే...
అంతులేని ఆనందాలే...
అంబరాన్ని అంటే సంబరాలే...
అతిథుల అక్షింతలే...ఆశీస్సులే...
మనసారా మమతల పెళ్లి పందిళ్ళే...
కడుపారా కమ్మని విందుభోజనాలే....
కానీ
నిన్న ప్రేమల
వానలు కురిసి...
మనసులు మురిసి...
నేడు విరిగిన ఆ మనసుల్లో
అనుమానాల మేఘాలు ముసిరి...
అపార్థాల అల్పపీడనాలు ఏర్పడి...
విభేదాల విషాదాల హోరుగాలులు వీచి...
అసూయద్వేషాల తుఫానులు చెలరేగి...
సమస్యల సునామీలు చుట్టుముడితే...
తప్పునా తీసుకోక " కోర్టులో విడాకులు...
ఔరా ఇది విధి వికృత చర్యనా..?
భార్యా భర్తల స్వయంకృతాపరాధమా..?
అహంకారమా..? ఆధిపత్యపోరునా..?
ఆ ఇద్దరిలో సహనం సంయమనం
సమయస్ఫూర్తి శూన్యమా..?
సుఖజీవన సూత్రాన్ని...
పవిత్ర మంగళసూత్రాన్ని...
ముడివేయకపోవడమా...?
ఏమై ఉండునోఎవరికి ఎరుక
పైనున్న ఆ పరమాత్మకు తప్ప...



