కవీ..! ఓ కవీ..!
కలం కత్తిని ధరించిన ఓ రవీ..!
నీ పేరు వినపడగానే
నీ కవిత మదిలో మెదలాలంటే...
నలుగురి నాలుకలపై
నీ కవిత నాట్యమాడాలంటే...
చిక్కని మజ్జిగలా ఉండాలంటే...
నిత్య నూతనంగా ఉండాలంటే...
నీ కవిత కమ్మగా కడుపు నింపేలా...
కాస్త బలంగా బరువుగా ఉండాలంటే...
నోరూరించే హైదరాబాద్ దమ్ము
బిర్యానీలా నీ కవితను వండాలంటే...
నలుగురికి ఆకర్షించేలా
నీ కవిత నవవధువులా ఉండాలంటే...
ఎన్నో ఏళ్లు గుర్తుండిపోయేలా...
గుండెలను తాకేలా కవిత వ్రాయాలంటే...
మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా
భద్రంగాదాచుకునేలా నీకవిత పండాలంటే...
కొత్త కొత్తపదాలు కదం తొక్కాలంటే...
పదికాలాలపాటు పచ్చగా ఉండాలంటే...
కొసమెరుపులు తళుక్కున మెరవాలంటే...
కాలగర్భంలో కలిసిపోక బ్రతికిబట్టకట్టాలంటే
కవీ..! ఓ కవీ..!
కలం కత్తిని ధరించిన ఓ రవీ..!
నీవు నిత్యవిద్యార్థివై ఉండాలి...
ప్రాచీన నవీన కవి పండితుల
బృహత్ గ్రంధాలను
లోతుగా అధ్యయనం చేయాలి...
కవిత్వమే ఊపిరిగా జీవించే
సాహితీమూర్తులతో
సంస్థలతో సత్సాంగత్యముండాలి...
ఆ సరస్వతి దేవి కరుణా కటాక్షం
నిండుగా మెండుగా నీకుండాలి...
నిత్యం నీ కలాన్ని
కత్తిలా పదునుపెడుతూ
సాహితీ తృష్ణతో సాధన చేయాలి...
మెరుగైన సమాజానికి
నీ కవిత్వం "రక్షణ కవచం" కావాలి...



