ఓ కవిశేఖరులారా...!
మీ ఆలోచనలే అక్షరాలైతే...?
అవి ఎక్కడున్నాయి ?
పల్లెల్లో పచ్చదనంతో
నిండి ఉన్నాయా ?
నగరాల్లో నగ్నంగా నాట్యమాడుతున్నాయా?
దీనులకు దౌర్భాగ్యులకు
అనాధలకు అమాయకులకు
విధివంచితులకు
వెన్నెల వెలుగులు పంచుతున్నాయా?
ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..?
ఓ కవిశేఖరులారా...!
మీ ఆలోచనలే అక్షరాలైతే...?
అవి ఏం చేస్తున్నాయి...?
తరతరాలుగా
అజ్ఞానంతో ...
అమాయకత్వంతో...
అణిచివేతకుగురియై
దుర్భర జీవితాలను జీవించే
బడుగు బలహీన వర్గాలకు...
సుశిక్షితులైన సైనికులుగా మారమని హింసించే ఈ సమాజాన్ని ప్రశ్నించమని ప్రతిఘటించమని నిత్యం పోరాడమని
మీ అక్షరాలు వారికి
శిక్షణ నిస్తున్నాయా? రక్షణ నిస్తున్నాయా?
ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..?
ఓ కవిశేఖరులారా...!
మీ ఆలోచనలే అక్షరాలైతే...?
అవి ఏం చేస్తున్నాయి...?
మధ్యపానానికి...మత్తుమందులకు
బానిసలై దారి తప్పుతున్న
యువతకు దారి దీపాలౌతున్నాయా?
నీతి నియమాలు మృగ్యమైన
మానవమృగాలలో మార్పుతెస్తున్నాయా?
ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..?
ఓ కవిశేఖరులారా...!
మీ ఆలోచనలే అక్షరాలైతే...?
అవి ఏం చేస్తున్నాయి... ?
కులం కుంపట్లను రాజేసే...
కులరక్కసులకు...
మతంపేర మారణహోమాలు
సృష్టించే మతోన్మాదులకు...
సమాధులు కడుతున్నాయా ?
సంతాపం తెలియజేస్తున్నాయా ?
ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు...?
ఓ కవిశేఖరులారా...!
మీ ఆలోచనలే అక్షరాలైతే...?
అవి ఏం చేస్తున్నాయి... ?
దోషులను శిక్షిస్తున్నాయా ?
నిర్దోషులను రక్షిస్తున్నాయా ?
ప్రార్థిస్తున్నాయా? అర్దిస్తున్నాయా?
వేడుకుంటున్నాయా? వేటకొడవల్లై
తలలు నరుకుతున్నాయా?
గడ్డిపరకల్లా...
గాలికి కొట్టుకుపోతున్నాయా?
గర్జించే పులులై...గండ్రగొడ్డల్లై...
కులంపేర కుమ్ములాటలతో
మతంపేర మారణహోమాలతో
కుళ్ళిపోయిన ఈ సమాజంపై
తిరుగుబాటుచేస్తున్నాయా?
ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..?



