Facebook Twitter
ఇక్కడ జలగలున్నాయి జాగ్రత్త ?

శవాలతో వ్యాపారమా?

ఈ కలికాలంలో 

ఈ కరోనా కాలంలో

ఏమి పట్టుకుపోదామని

ఈ దారుణమైన ధనదాహం 

బెడ్సులేవంటారు,వెంటిలేటర్స్ 

పని చేయడం లేదంటారు

డబ్బు పిచ్చిపట్టి 

పచ్చిఅబద్ధాలు ఆడుతుంటారు

కనికరం, జాలి, మానవత్వమే లేకుండా

ఆపదలోవుండి ఆశతో ఆసుపత్రికి వచ్చిన

కరోనా రోగుల్ని అర్థరాత్రుల్లో అంబులెన్సుల్లో

ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుంటారు

 

ఒక బెడ్డిమ్మన్నా ,పేషంటును చేర్చుకోమన్నా

కాళ్ళావేళ్ళా ప్రాధేయపడినా కనికరమే లేక

రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు

బ్లాక్ లో బెడ్లు అమ్ముకొంటున్నారు

సొమ్ము చేసుకుంటున్నారు

అవసరం లేకన్నా టెస్టులంటూ

ఇవ్వని మందులు ఇచ్చినట్లుగా

చేయని వైద్యం చేసినట్లుగా

కళ్ళు తిరిగే దొంగ బిల్లులతో 

దొరికినంత దోచుకుంటున్నారు

 

ప్రాణభయంతో పరుగులు పెట్టే

కరోనా రోగులకు చుక్కలు చూపిస్తున్నారు

చచ్చిన శవాలను కుక్కలు పీక్కుతింటాయి

ఆ కుక్కలు ఛస్తే రాబందులు పీక్కుతింటాయి

కాని బ్రతికుండగానే రాబందుల్లా

కాసులకు కక్కుర్తిపడి ఆసుపత్రికి వచ్చిన 

కరోనా రోగులను కరోనా కన్నా ఘోరంగా

కార్పొరేట్ ఆసుపత్రులు పీక్కుతింటున్నాయి

ఈ రాబందులను ఏమనాలి?

 

నిన్నటి వరకు వీరే మనకు ప్రాణదాతలు

కాని నేడు 

వీరే మనపాలిట యమదూతలు

వీరే మన రక్తాన్ని త్రాగే రాక్షసులు

వీరే భారీబిల్లులతో పీల్చిపిప్పిచేసే జలగలు

 

నిన్నటి వరకు "ఇంటిముందు హెచ్చరిక"

"ఇంట్లో కుక్కలున్నాయి జాగ్రత్త అని,

కాని నేడు

 "కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెచ్చరిక"

"ఇక్కడ జలగలున్నా జాగ్రత్త" అని

మిత్రులారా ! మరి జాగ్రత్త !! తస్మాత్ జాగ్రత్త !!!