మొన్న... వారి జీవితం
నిండుకుండ పాలకుండ
పడకుండ ఒక్క విషపుచుక్క
ఎన్నోఏళ్ళు గడిచాయి హాయిగా
విధి ఒక్క విషపు నవ్వు నవ్వింది
విలువైన జీవితం విషతుల్యమైంది
నిన్న వారిది...
పండువెన్నెలవంటి పచ్చనికాపురం
నిప్పులాంటి..."చిన్నతప్పు"జరిగి
కాపురంలో "కారుచిచ్చు"రగిలి
కమ్ముకున్నాయి...కారుచీకట్లు
ప్రస్తుతం..."కాపురం" క్రాస్ రోడ్లో
కునుకులేదు...కంటినిండా
తిండిలేదు...కడుపునిండా
వున్నాఅందరిలో... ఒంటరిభావన
కాలం గడుస్తోంది... కన్నీటిధారలతో
కన్నుమూస్తే చాలు... పీడకలలే
చుట్టుముట్టేది...పిచ్చి ఆలోచన్లే
నిన్న వారు...
అందరికి దేవుళ్ళు దేవతలు
నేడు కొరివిదెయ్యాలు
నిన్న పూలవర్షం...నేడు రాళ్ళవర్షం
నిన్న ప్రక్కనున్నవారంతా
నేడు వెయ్యి మైళ్ళదూరంలో
నిన్న శ్రేయోభిలాషులెందరో
నేడు అందరూ పరమ శత్రువులే
నిన్న పలికి ప్రతిపలుకు అమృతమే
నేడు చిన్నమాట సైతం విషపుచుక్కే
ఔను మనిషిలో మచ్చలేని వ్యక్తిత్వం వున్ననాడే
మనిషికి గౌరవం లేకున్న బ్రతుకు బహుదుర్భరం



