కులమనే విషవృక్షానికి
కొమ్మలు రెమ్మలు
కాండము నరికితే కాదు
దానిని కూకటివేళ్లతో
సహా పెకలించి వేయాలి
కుక్కల్ని పిల్లుల్ని పూజిస్తారు
పుట్టలో పాముల్ని పట్టుకుంటారు
కుష్టువాన్ని ముష్టివాన్ని
ముట్టుకుంటారు కానీ
సాటిమనిషిని నీచంగా చూస్తారు
మూఢనమ్మకాలన్నింటిని
మూలకు నెట్టండి
అదృష్టం కర్మసిద్ధాంతాలను
ప్రక్కన పెట్టండి
తిరుగులేని ఒక సంఘటితశక్తిగా
మారి తిరుగుబాటు చేయండి
తినడానికి తిండి
తీర్థయాత్రలతో రాదు
పూజలు పునస్కారాలు
గంగస్నానాలు చేస్తే పుట్టదు
రాజ్యాధికారం సంపాదించుకోవాలి
రాజులు కాలేకపోయినా
రాజ్యాలను ఏలకపోయినా
కనీసం బానిసత్వం నుండైనా
మీకు విముక్తి లభిస్తుంది
కులం కులమని అరవకండి
నిరంతర శ్రమ
ఆలోచన కసి కృషి
పట్టుదల ద్వారానే మనిషి
ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు
కులం పునాదుల మీద ఒక జాతినిగాని
ఒక నీతిని గానీనిర్మించలేరు
ఒక వ్యక్తి కంటే జాతి ఒక జాతి కంటే
సంఘం సంఘం కంటే దేశం గొప్పది
ఈ కులవ్యవస్థ నిర్మూలించబడడానికి
దివ్యమైన మార్గం వర్ణాంతరవివాహాలే
అన్న అంబేద్కర్ అమృతవాక్కులను కలలో
సైతం మరువకండి నిత్యం మదిలో జపించండి
ఆనంతశక్తిని పొందుతారు అద్భుతాలు సాధిస్తారు



