Facebook Twitter
నశించాలి...నశించాలి

నేను...నాది అనే భావన

నేను...నాది అనే భావన నశించి
మనము...మనది అనే భావన
ప్రతి ఎదలో ఉషోదయ కిరణంలా
ఉదయిస్తేనే జీవితానికి పరిపూర్ణత

వాసన చూసి పువ్వును
రుచిని చూసి కాయను
ఇంటిని చూసి ఇల్లాలిని
విద్యను చూసి గురువును
గుర్తుపట్టినట్లు ఉన్నతమైన
ఉదాత్తమైన లక్షణాలున్న
ప్రతిమనిషిని గుర్తించి గౌరవించాలి

మనసున అలజడులను రేపే
అరిషడ్వర్గాలను అశ్వాలను
అదుపు చేయగలిననాడే మనిషి
ధర్మబద్ధంగా జీవించగలడు
కట్టెగా మారేంతవరకు కఠినమైన
నిర్ణయాలకు కట్టుబడి ఉండగలడు

పురాణాలను పుక్కిట పట్టి
అందులోని మేలిమిరత్నాలను
మనసున అలంకరించుకున్న మనిషి
మెరిసే ఓ రత్నమే ఓ ఆణిముత్యమే

నది నదిలా ప్రవహిస్తే అది అదృష్టమే
కడలిలో కలిశాక కోల్పోతుంది అస్తిత్వమే 
మనసు మనిషి అదుపులో ఉన్నంత కాలం
మనిషి మహర్షే మహాత్ముడే మహనీయుడే
కోరికల సంద్రాన కొట్టుకుపోయేనాడు మనిషి
తీరేవేరు వాడి‌దారి పెడదారే బ్రతుకు గోదావరే