కమ్మని కలలెన్నోకని
కన్ననాటినుండి
కన్నబిడ్డలు కళ్ళు
తెరిచిన నాటినుండి
రాత్రింబవళ్ళు
కంటికిరెప్పలా కాపాడిన
కాలిలో ముల్లుగుచ్చుకుంటే
కన్నీరు కార్చిన
ఆరనిఆకలిమంటల్ని
చిరునవ్వుల్లో దాచుకొన్న
కన్నబిడ్డలకు కడుపునిండా
తిండిపెట్టి ఆకలితీర్చిన
చిన్నజబ్బుచేస్తే డాక్టర్
దగ్గరికి పరుగులు పెట్టిన
తలకుమించి అప్పులుచేసిన
స్కూలు కాలేజి ఫీజులు కట్టిన
గొప్ప విద్యావంతులను చేసిన
ఉన్నతుద్యోగులుగా తీర్చిదిద్దిన
కాలి చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి
ఖరీదైన విదేశీ సంబంధాలు వెదికి వెదికి
అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసిన
ఆస్తులుపంచి అస్థిపంజరాలుగా మిగిలిన
అమ్మానాన్నలను
కనికరం లేక కసిరి కొట్టే...
బాధ్యతలేక బయటికి నెట్టే...
కన్నబిడ్డలెంతటి కఠినాత్ములు! ఔరా
ఎంతటి క్రూరులు ! ఎంతటి నీచులు !
ఎంతటి మూర్ఖులు ! ఎంతటి నిర్దయులు !
ఇంతటి పాషాణ హృదయులైన దయాదాక్షిణ్యం
కృతజ్ఞతలేని ఈ కుమారులకన్నా ఈ కుమార్తెలకన్నా
వీధిల్లోవున్న విశ్వాసమున్న ఆ శునకాలే నయం గదా!
ఓదైవమా చనిపోయాక కట్టే "చలువరాతి సమాధులకన్న"
ముసలితనాన ఇంత "ముద్దపెట్టే చేతులే" మిన్న యన్న
కాసింత ఇంకితజ్ఞానాన్ని ఈపిల్లలకు ప్రసాదించండి ప్రభూ!



