Facebook Twitter
అమరగాయకునికి కన్నీటి వీడ్కోలు...

నిన్న
16 భాషల్లో
40 వేలపాటలతో
చలన చిత్రసీమలో
సంగీత సామ్రాజ్యానికి
మకుటంలేని మహారాజని
పద్మవిభూషణ్ అవార్డుగ్రహీతని
ప్రశంసలు కురిపించిన కవులకలాలు
నేడు కన్నీరు కారుస్తున్నాయెందుకు?
వారి గుండెలు లయతప్పి వ్యధతోబాధతో
బరువెక్కి బావురు మంటున్నాయెందుకు?

నిన్న చెక్కెర పోసుకున్న
చెరుకురసం త్రాగిన కోట్లాదిశ్రోతల చెవులు
నేడు వెక్కివెక్కి ఏడుస్తున్నాయెందుకు?
నిన్న టీవీలో కళకళలాడిన సంగీతసభలన్నీ
నేడు వెలవెలలాడిపోతున్నాయెందుకు ?

నిన్న కమ్మని స్వరామృతాన్ని ఆస్వాదించి
వెన్నెల్లా వెలిగిన, మిలమిలమెరిసి,
మురిసిపోయిన ఆ టీవీముఖాలన్ని
నేడు కన్నీటిధారలతో కందిపోయాయెందుకు?

నిన్న ఉల్లాసం ఉత్సాహంగా తమ
పసందైన పాటలతో పరవశింపచేసిన
ఆబాలగోపాలాన్ని అలరించిన
ఔత్సాహిక గాయనీ గాయకులందరో
ఓ శంకరా దివిలో విరిసిన మాపారిజాతమెక్కడ ?
మా గానగందర్వుడు ? మా దైవమెక్కడని
వెర్రిచూపులుచూస్తూ వేయిదిక్కుల్లో వెతుకుతూ
వెక్కివెక్కి ఏడుస్తున్నారెందుకు?

ఆ కరోనా విషకౌగిలిలో 48రోజులు
నలిగిపోయిన గంగాప్రవాహంలాంటి అలసిపోని
బాలుగారి గాత్రం ఆ గాలిలో కలిసి పోయినందుకా?

కోట్లమందికి తన గానామృతంతో 
కళ్ళల్లో కాంతిని, మనసులో శాంతిని,
గుండెలో నిబ్బరాన్ని, జీవితంలో ప్రశాంతతను
ప్రసాదించిన ఆ సుందర సుమధుర
సుస్వర గందర్వగానం ఇక వినిపించదనా ?
భువినుండి దివికేగిన ఆ గంభీరమైన
గానగంధర్వుడు ఇక మనకళ్ళకు కనిపించడనా?

ఎన్నాళ్ళో వేసిన ఉదయం
ఈనాడే ఎదురౌతుంటే....అనే పాటను
ఆ స్వర్గలోకంలో జరిగే స్వరాభిషేకంలో
అమరగాయకుడు ఘంటసాలతో కలిసి
పాడేందుకు బాలు పయనమై పోయినందుకా?

తన గొంతులో దాచుకున్న
గానామృతంతో పాటపాటను తడిపి
పాడిన ప్రతిపాటకు ప్రాణం పోసిన
ఆ అమరగాయకుని గొంతును
కరుణా జాలి దయలేని ఆ
కరోనారక్కసి కర్కశంగా నొక్కేసినందుకా?

ఎందుకు ? ఎందుకు ? ఎందుకు...?
ఒక్క గొంతు మూగబోయినందుకు
చలన చిత్రసీమ నివ్వెరపోయినందుకు
శోకసముద్రంలో మునిగి పోయినందుకు

అందుకే... అందుకే....
ఈ అశ్రునయనాలు
కన్నీటి పాటలను వర్షిస్తున్నాయి
ఆ అమరగాయకుని
ఆత్మకు శాంతికలగాలని
ఆ భగవంతున్ని అర్థిస్తున్నాయి
కన్నీటితో ప్రార్థిస్తున్నాయి

ఎరుపెక్కిన కళ్ళతో..బరువెక్కిన గుండెలతో....
మూగమనుసులతో...శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాయి....