Facebook Twitter
ఓకే ఒక్కటి చాలు...!

కడివెడేలనోయి ఖర్మపాలు
గరిటెడు చాలోయి గంగిగోవు పాలు

అనుభవం పండిన హస్తవాసి ఉన్న
డాక్టరిచ్చే"ఒకే ఒక్క టాబ్లెట్ "చాలు
భూతాలవంటి మొండివ్యాధులు
భూస్థాపితం కావడానికి...

బావిలో వెయ్యిఅడుగుల తర్వాత
తవ్వే" ఒకే ఒక్క అడుగు"చాలు
నీళ్లు పైకి చిందడానికి...
మన అదృష్టం పండడానికి...

ఆశతో ఆవేదనతో కన్నీటితో
చేసే"ఒకే ఒక్క ప్రార్థన"చాలు
వేయి వరాలు పొందడానికి...
బ్రతుకు బంగారమైపోవడానికి...

ఆర్థిక సమస్యలెన్నో
చుట్టుముట్టి ఊపిరాడక
ఉక్కిరిబిక్కిరయ్యే వేళ
తగిలే "ఒకే ఒక్కలాటరి" చాలు
బికార్లు బిల్ గేట్స్ కావడానికి...
క్షణాల్లో జీవితాలు మారడానికి...

నాలుక పై "ఒకే ఒక్క విషపుచుక్క"
పడితే చాలు మర్రిచెట్టంత
మనిషి మట్టిలో కలిసి పోవడానికి...

మహర్షులు
మంత్రశక్తిగల
మహా తపోసంపన్నులు
సహనం కోల్పోయి
ఉద్రేకంతో ఊగిపోతూ
ఆగ్రహంతో ఆవేశంతో
రక్తవర్ణ నేత్రాలతో చూసే
"ఒకే ఒక్కచూపు"చాలు
పచ్చని చెట్లు సైతం
భస్మమైపోవడానికి...
కడకు బూడిదైమిగలడానికి...

కొట్లాడి కోర్టుకెక్కిన
జగడామారి జంటలు
సారీ నన్ను క్షమించమని...
ప్రేమతో...పశ్చాత్తాపంతో
పలికే "ఓకే ఒక్కమాట" చాలు
పచ్చని కాపురాలు చిగురించడానికి...
ప్రశాంతంగా ఇద్దరూ నిదురించడానికి...

ఒక "అరక్షణం" చాలు
"ఓకే ఒక్క అగ్నికణం" చాలు
ఆరని కార్చిచ్చు రేగడానికి...
కారడవి తగలబడి పోవడానికి...

"ఒకే ఒక్కచిన్న రంద్రం" చాలు
పెద్దతిమింగలంలాంటి ఓడ మునిగి
కళ్ళముందే కనుమరుగైపోవడానికి... 

వేయియేల వెర్రిసంబంధాలు...?
"మంచిగంధమంటి
"ఒకే ఒక్క సత్సంబంధం" చాలు
కళ్యాణ వేదిక కళకళలాడిపోవడానికి...
మూడుముళ్లతో జంట మురిసిపోవడానికి...