Facebook Twitter
కన్నబిడ్డలా ? కారడవిలో మృగాలా ?

యుక్తవయసులో

తీయని కలలుకంటారు

ఒక ఆస్తిపరుడైన భర్త దొరకాలని

ఒక అందమైన భార్య రావాలని

 

పెళ్లై భార్యభర్తలైన తర్వాత

ఒక కొత్త జంటగా

కమ్మని కలలు కంటారు

ఓ చక్కని బాబో

ఓ అందమైన పాపో పుట్టాలని

 

ఆపై తల్లిదండ్రులైన తర్వాత

తిరిగి తీయని కలలుకంటారు

కన్నబిడ్డలు అమెరికాలో ఖరీదైన

చదువులు చదవాలని,

కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని

అందరికన్న

ఉన్నతమైనస్థితిలో ఉండాలని

ఎంతో ఎత్తుకు ఎదిగాలని...

 

కానీ వృద్ధులైపోయిన తల్లిదండ్రుల

గురించి ఎవరూ శ్రద్ద చూపరేమి?

వారి బాగోగుల గురించి కన్నబిడ్డలు

సైతం కలలు కనరేమి? కారణం ఒక్కటే

నిన్నవారిపై వున్న ప్రేమ... నేడు సన్నగిల్లడం

రక్తసంబంధాలన్నీ... రచ్చబండలైపోవడం

బందాలు అనుబంధాలన్నీ... ఆవిరైపోవడం

 

కంటిచూపు మందగించి

కాళ్లల్లో సత్తువలేక పాపం

కర్ర ఆధారంతో నడిచే కన్నవారిని

అనాధ ఆశ్రమాలలో చేర్చి వారిని

రెక్కలు తెగిన పక్షులుగా

దిక్కులేని అనాధలుగా ఆకలికి 

అలమటించే అస్థిపంజరాలుగా మార్చే 

కన్నబిడ్డలకన్న కారడవిలో మృగాలేమిన్న 

ఔనంటారా....కాదంటారా...మరి మీరేమంటారు?