పెళ్ళయ్యాక
పిల్లలకు తల్లయ్యాక
కామంతో కళ్ళుపొరలు కమ్మి
ప్రేమఊబిలోకి జారిపోతే
నేడాకుటుంబానికి...
ఎంతటి పెనుప్రమాదం
ఎంతటి మానసిక క్షోభ
ఎన్ని అవమానాలో ఎవరికెరుక?
నేడాకుటుంబం
వెక్కివెక్కి ఏడుస్తోంది
నక్కినక్కి తిరగుతోంది
నడివీధిలో పరువుపోయి
నలుగురిలో నవ్వులపాలై
నేడాకుటుంబం
ఆత్మహత్య అంచుల్లోకి జారింది
సంసారంలో ప్రశాంతత కరువైంది ?
నిన్న
ఆ ఇల్లు
ఒక స్వర్గధామం....
నేడు ఒక నరకకూపం....
నేటి ఈ మాయని మచ్చ ఆ
కుటుంబానికి ఒక తీరనిశాపం...
ఆ కుటుంబం
నిన్న పరువుగా బ్రతికింది
నేడు వ్యధలకు బాధలకు
...దగ్గరగా
బంధువులకు మిత్రులకు
....దూరంగా
మునిగిపోయింది
.....మురికికూపంలో
స్నానమాడుతోంది
... బుసలుకొట్టే సమస్యల
సర్పాల సరోవరంలో
దూరింది...ముళ్ళకంపలో...
దూకింది...అగ్నిగుండంలో...
అందుకే కావాలి ఆ కుటుంబానికి
కాసింత... ఓదార్పు కాసింత....ప్రశాంతత
కాసింత... ఉపశమనం కాసింత...భరోసా
తప్పు ఒకరిదే కానీ శిక్ష కుటుంబానికి
కారణం అనుబంధం రక్తసంబంధం...ఔను
ఈ అగ్నిపరీక్షలో.... ఈ అగ్నిగుండంలో
ఈ అంధకారంలో...ఈ ఆపత్కాలంలో
ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యమే ఆయుధాలుగా సమిష్టిగా
సాహసంతో సంకల్పబలంతో సమస్యను ఎదుర్కోవాలి
సామూహిక ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారమా?కాదు
అందుకే పిరికిపందల్లా పారిపోరాదు...పిట్టల్లా రాలిపోరాదు



