కుక్కనక్క
పోలిక ఒక్కటైనా
ఈ విశాల విశ్వంలో
ఆ రెండింటిని
విడదీసేది విశ్వాసమే
అందుకే అన్నారు
పురుషుల్లో
పుణ్యపురుషులు వేరని
కుక్కల్లో
విశ్వాసంగల కుక్కలు వేరని
ఇంటికుక్కఒక్కటే
కడుపునిండ తినేది
కంటినిండా నిద్ర పోయేది
అరిచేది కరిచేది తక్కువే
అది కాపలా కాసేది కూడా
ఇంటిని,ఇంటి యజమానినే
వీధిలో కుక్క ఒక్కోసారి
ఆకలికి అలమటిస్తుంది
ఖర్మకాలిఎప్పుడైనా
ఆకలికి తాళలేక
చిన్న తప్పుచేస్తే చాలు
దొంగగా మారితే చాలు
ఏదైనా ఇంట్లో దూరితే
చాలు కాళ్ళు విరగడం ఖాయం
చెట్టుతాను నేలకొరిగే వరకు
తనను గొడ్డలితో నరికే వారికి
నీడనిచ్చినట్టే ఆ కుంటి కుక్క
వీధుల్లో రాత్రంతా తిరిగితిరిగి
ఊరంతా కాపలా కాస్తూవుంటుంది
కంటపడితే దొంగల వెంటపడుతుంది
భయపెడుతుంది వారి భరతంపడుతుంది
అందుకే ఇంటికుక్కలకే కాదు
వీధికుక్కలకు సైతం విలువనిద్దాం
కరుణ చూపి కడుపులు నింపుదాం
తమ వ్యధల్ని వ్యాధుల్ని కన్నీటి గాథల్ని
వ్యక్తం చేయలేని మూగజీవాలను ప్రేమిద్దాం
మనలోని మానవీయతను మేల్కొల్పుదాం



