ఆహా! ఔరా!
ఎంతటిచిక్కని చక్కని
వింత నిర్మాణమిది!
ఆపక్షికి అంతటి
విజ్ఞానం ఎక్కడిది?
చదువు లేకున్నా
చేతులు లేకున్నా
గురువు లేకున్నా
ఎవరి సహకారం లేకున్నా
ఒంటరిగానే
ఒక్కొక్క గరికపుల్లను
గాలించి గాలించి
నిద్రాహారాలు మాని
నిర్విరామంగా సేకరించి
రోజుల తరబడి
కష్టపడి ఇష్టపడి శ్రమపడి
ముక్కుతో చెక్కిన
చక్కని శిల్పమది
హోరుగాలికి
జోరువానకు
పెనుతుఫానులకైనా
చెక్కచెదరని రీతిలో
చెట్టుకొమ్మల్లో
నిర్మించుకున్న
తన గూడు అది
తన సొంత
ఇంద్రభవనమది
తాను గాలిలో ఊగే
బంగారు ఊయలది
ఆకాశ వీధిలో గిజిగాడు
కష్టపడి కట్టిన అందమైన
సుందర భవనమది
ప్రకృతి మెడలో
ఓ పక్షిపిల్ల వేసిన
పచ్చలహారమది
కాదు వాడు గిజిగాడు
సృష్టికర్తను నివ్వెరపరచే
విశ్వాన్నే విస్మయరపరచే
గిరిపుత్రుడు జ్ఞాననేత్రుడు
ఆ గిజిగాడిగూడు గుర్తుచేస్తుంది
నేలమీద తిరుగు ప్రతిమనిషికి
"కష్టేఫలి" అనే ఓ నవ"జీవనసూత్రాన్ని"



