Facebook Twitter
దారిలో దయ్యం-నాకేం భయం

దారిలో దయ్యం-నాకేం భయం

 


లోచర్లలో ఉండే చందు ఇప్పుడిప్పుడే ఆరో తరగతికి వచ్చాడు. వాళ్ల ఊరులో హైస్కూలు లేదు. అందుకని రొద్దం బడిలో చేరాడు. లోచర్ల నుండి రొద్దానికి పన్నెండు కిలోమీటర్లు. రోజుకు నాలుగుసార్లు అటూ ఇటూ తిరిగే బస్సొకటి ఆ ఊరి జనాలను, మిగతా ప్రపంచంతో‌ కలుపుతుండేది. లోచర్ల పిల్లలు ఓ నలుగురు కలిసి, బస్సులో రొద్దం బడికి వెళ్ళి వస్తుండేవాళ్ళు ప్రతిరోజూ. పెద్దవాళ్లెవరూ వెంట లేకుండా తాము పిల్లలమే అట్లా వెళ్ళటం వింతగానూ, కొంచెం భయంగానూ ఉండేది వాళ్లకు. అంతే కాక రొద్దం చుట్టుప్రక్కల అంతా చిన్నపాటి గుట్టలూ, నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలూ చాలా ఉండేవి. బస్సులు రాకపోయినా, ఏ కారణం చేతైనా రద్దైనా పిల్లలు ఊరికి నడిచి రావాల్సి వచ్చేది. నడిచి వచ్చేసరికి రాత్రి బాగా చీకటి పడిపోయేది కూడా.


అట్లాంటప్పుడు సాధారణంగా పిల్లలకందరికీ దయ్యాలు గుర్తుకొచ్చేవి. వాళ్ళలో ఎవ్వరేగానీ దయ్యాల్ని ఎప్పుడూ చూడలేదు- అయినా అందరికీ అవంటే చాలానే భయం ఉండేది. అయితే స్వతహాగా చాలా తెలివీ, ధైర్యమూ, ఆత్మవిశ్వాసమూ ఉన్న చందుకు మటుకు "కనీసం ఒక్క దయ్యాన్నైనా దగ్గరగా చూడాలి; దానితో‌ మాట్లాడాలి; దాన్ని ముట్టుకోవాలి" అని విపరీతమైన కోరిక ఉండేది. చాలా సార్లు ఆ సంగతిని వాడు మిగిలిన పిల్లలకు చెప్పి ఉన్నాడు కూడా.

 

ఒకసారి బడినుండి పిల్లలంతా ఇంటికి వస్తుండగా, దారిలో బస్సు టైరు పంక్చర్ అయ్యింది. ఆ సమయానికి బస్సులో ఎక్కువమంది లేరు. డ్రైవరు, కండక్టరు బస్సును అక్కడే ఆపేసి, "మీరంతా ఊరికి నడిచి వెళ్ళిపోండి" అని చెప్పేసారు. బస్సులో ఉన్నవాళ్లంతా దిగి చకచకా నడక మొదలెట్టారు. ఒక ఐదు నిముషాల తర్వాత చూస్తే ఈ పిల్లల కనుచూపు మేరలో అంతా నిర్మానుష్యం! చుట్టూ అలుముకుంటున్న చీకటి...

వీరుగాడు ఓ దయ్యం గురించి చెప్పటం మొదలు పెట్టాడు. అది తెల్లగా ఉంటుందిట, మబ్బులాగా. దాని నోట్లో రెండు నాలుకలు ఉంటాయట. పిల్లలంతా ఒకవైపున వణికి పోతూనే మరోవైపున ఆసక్తిగా వింటూ నడుస్తున్నారు. మెల్లగా వెన్నెల కాయటం మొదలైంది. అంతలో వాళ్ళకు ఓ ముసలమ్మ కనిపించింది. ఓ కట్టె పట్టుకొని నడుస్తున్నది. తను కూడా లోచర్ల వైపే పోతున్నది. తెల్ల బట్టలు వేసుకొని, జుట్టు విరబోసుకొని ఉన్నది.

పిల్లలు ఆమెను దాటుకొని పోబోతుండగా అడిగింది: బాబులూ! చీకటి పడినట్లున్నది. నాకు చూపు సరిగ్గా ఆనదు. కొంచెం మా ఇంటి వరకూ నాతో పాటు తోడుగా వస్తారా నాయనా?" అని. చందు ఆమె దగ్గరికి వెళ్ళి, "ఎక్కడవ్వా, మీ ఇల్లు?" అని అడిగాడు.

"దగ్గరికి వచ్చేసాం బాబూ. అదిగో ఆ అక్కడ కనిపించేది మాదే" అన్నది అవ్వ ఓ వైపు చూపిస్తూ. చూస్తే అది ఏమంత దగ్గర అనిపించలేదు. పిల్లలంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చందూ ఆమెతో "సరే పద అవ్వా! నేను వస్తాను నీతో; వీళ్లందరినీ ఇంటికి పొమ్మందాం" అని ఆమె వెంట బయలుదేరాడు. మిగిలిన పిల్లలంతా ఒకసారి వాడికేసి జాలిగా చూసి, తమ నడక వేగం పెంచారు. అవ్వ వాడిని ఏవేవో వంకర దారుల గుండా తీసుకెళ్ళింది. "ఇంకా ఎంత దూరం అవ్వా?" అంటే, "ఇదిగో- ఇక్కడే" అంటున్నది. చివరికి వాళ్ళిద్దరూ ఓ స్మశానంలోకి ప్రవేశించారు. చందుకి వణుకు వచ్చినట్లు అయ్యింది. "ఏంటీ?! మీ ఇల్లు ఇక్కడా?!" అని అడిగాడు వణుకుతున్న గొంతుతో.

"అవును బాబూ! మేమూ, మా పిల్లలూ అందరం ఉండేది ఇక్కడే. బాగా లేదా?" సన్నగా నవ్వింది అవ్వ. "అంటే... అంటే.. మీరు దయ్యాలా?!" అరిచాడు చందు, ఎర్రబడిన ముఖంతో. "కాదు బాబూ! అయితే ఇట్లా రాత్రివేళల్లో మమ్మల్ని చూసినవాళ్ళు అందరూ అట్లానే అనుకుంటారు. నిజానికి మేం ఈ ప్రాంతం మొత్తానికీ కావలి వాళ్ళం. మిగతా వాళ్ళందరూ భయపడుతూ దూరం ఉండే ఈ ప్రదేశంలోనే మేం నిర్భయంగా తిరుగులాడతాం. తిరిగి తిరిగి ముసలివాళ్లం అవుతాం ఇట్లాగ!" నవ్వింది అవ్వ.

 

"మరి మీ భోజనమూ, అదీ?!" అడిగాడు చందూ, అనుమానంగా. "ఏవో దొరికిన పక్షుల్నీ, జంతువుల్నీ తింటాం. అడవిలో దొరికే వెదురుబియ్యం, దుంపలు పళ్ళు వండుకుంటాం" చెప్పింది అవ్వ. "మరి ఇక్కడి దయ్యాలు మిమ్మల్నేమీ చెయ్యవా?!" అడిగాడు చందు. అవ్వ కిసకిసా నవ్వింది. "దయ్యాలు ఎక్కడున్నై బాబూ?! లేవు! మాలాంటి వాళ్లనే మీవాళ్ళు 'దయ్యాలు' అని చెప్పుకుంటూ, వాళ్ళు భయపడుతున్నారు; మమ్మల్ని దూరం పెట్టి చిన్నబుచ్చుతున్నారు" అంది అవ్వ.

ఆమె ధన్యవాదాలు అందుకొని, చందూ ఇంటికి బయలు దేరాడు. ఆలోచించినకొద్దీ వాడికి ఆశ్చర్యం వేసింది: "నిజమేనా? వీళ్లంతా మనుషులేనా? దయ్యాలు లేవా, అసలు?!" అని. అయితే గాలికి ఊగుతూ చెట్లు విడుస్తున్న వెన్నెల నీడలు ఇప్పుడింక తనని భయపెట్టటం మానేసాయని వాడు గమనించలేదు. కదిలే ఆ నీడలు చాలా అందంగా ఉన్నాయనిపిస్తున్నది వాడికి! ఇక ఆ తర్వాత వాడికి చీకటంటే భయం పూర్తిగా పోయింది కూడా!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో