Facebook Twitter
కోపం వచ్చిన చీమ

కోపం వచ్చిన చీమ

 

 

అనగనగా ఓ ఇంటి ఆవరణలో ఉండేవి- ఒక చీమ, ఒక దోమ, ఒక ఈగ. దోమ పాటలు పాడుతూ మొక్కల చుట్టూ, పొదల చుట్టూ, మనుషులచుట్టూ తిరుగుతుండేది. ఈగ ఎక్కడ ఆహారం కనబడితే అక్కడ, ఆ ఆహారం చుట్టూ గింగిరాలు కొడుతుండేది. చీమ మటుకు ఎక్కడెక్కడో పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరి తన ఇంటికి మోసుకొని వెళ్తూ ఉండేది రోజంతా. దానికి ఆశ ఎక్కువని, ఎప్పుడూ ఆహారాన్ని సేకరించుకొని కూడబెడుతూనే ఉంటుందని ఈగ, దోమ ఆటపట్టిస్తూ ఉండేవి. కానీ చీమ మటుకు ఆ మాటల్ని పట్టించుకునేది కాదు. "నాకూ వస్తుంది అవకాశం. అప్పుడు చెబుతా, వీళ్ళ పని!" అని సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుండేది.

 

ఒకసారి చీమకు ఎదురొచ్చింది ఈగ. చీమ ప్రక్కకు తప్పుకొని వెళ్ళబోయింది; కానీ దాన్ని ముందుకు పోనివ్వలేదు ఈగ. 'ఏయ్! చీమా! ఆగు! నీకన్నా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే నమస్కరించాలన్న కనీస జ్ఞానం కూడా లేదా, నీకు?' అన్నది చీమ దారికి అడ్డం వస్తూ. చీమకు కోపం వచ్చింది. 'నువ్వు నాకంటే దేనిలో గొప్పవాడివోయ్?' అని అడిగింది ఈగను. 'నేను ఏ ఆహారాన్నయినా రుచి చూడగలను. ఏ చోటికైనా వెళ్లగలను. ఎవరూ నన్ను ఆపలేరు' జవాబిచ్చింది ఈగ, గర్వంగా. 'అవునవును. పిలువని పేరంటానికి వెళ్తుంటావు నువ్వు. అందరూ నిన్ను ఛీ కొడుతుంటారు. నువ్వూ, మీవాళ్ళూ అందరూ అసహ్యించుకునే పదార్థాలమీద కూడా వాలుతుంటారు. 'మీ రాక ఎన్నో అనారోగ్యాలకు మేలుకొలుపు' అని అందరూ భయపడుతుంటారు. రోగాలను ఒకరినుండి ఒకరికి చేర్చటంలో మీకు మీరే సాటి! కాస్త పక్కకు తప్పుకుంటే నా దారిన నేను వెళ్తాను. చాలా పని ఉంది' కోపంగా జవాబిచ్చి ముందుకు కదిలింది చీమ. ఈగ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యింది. మౌనంగా ప్రక్కకు తప్పుకున్నది.

 

 

కొంచెం దూరం వెళ్ళగానే దోమ ఎదురైంది చీమకు. 'ఏంటి చీమక్కా! కాసేపు తిండి యావ మానేసి, ప్రపంచం ఎంత అందంగా ఉందో, నీ చుట్టు ప్రక్కల వాళ్లు ఎంత సంతోషంగా జీవిస్తున్నారో చూడు, ఓసారి' అంది దోమ, చీమకు హితోపదేశం చేస్తున్నట్లు. 'నువ్వేనా, సంతోషంగా జీవిస్తున్నది?' అడిగింది చీమ, చిర్రెత్తుకురాగా. 'అవును! నేను ఎక్కడికి కావలిస్తే అక్కడికి ఎగిరి పోగలను. కావలసినంత రసాన్ని, రక్తాన్ని పీల్చగలను. రాజు గారిని కూడా‌వేధించగలను' అంది దోమ. 'ఆ రాజుగారు అరచేతితో ఒక్కటిస్తే చావగలవు కూడాను, నువ్వు! దొంగ చాటుగా‌ మనుషుల రక్తాన్నీ, జంతువుల రక్తాన్నీ‌, మొక్కల రసాన్నీ పీల్చుకొని బ్రతికే పరాన్న జీవివి, రక్త పిపాసివి నువ్వు. గర్వపడకు. నాలాగా కష్టపడి సంపాదించింది తిను- స్వయం కృషితో సంపాదించిన ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది. అయినా కష్టపడి బ్రతికే కూలిదాన్ని నేను. రాక్షసులతోటీ, దొంగలతోటీ నాకు పనేమున్నది? అడ్డులే! పోనివ్వు!' అని ముందుకు కదిలింది చీమ. దోమ బిత్తరపోయి చూసింది.

 

తర్వాత వర్షాకాలం వచ్చింది. కుండపోతగా వర్షం కురిసింది. దోమకు, ఈగకు ఆకలి ఎక్కువైంది. మనుషుల రక్తం పీల్చాలని పోయిన దోమ, విషపు వాసనలకు తట్టుకోలేక పోయింది. ఊపిరాడక చనిపోయింది. మనిషిని చికాకు పెట్టిన ఈగ కూడా అకాల మృత్యువు పాలైంది. చీమ మాత్రం వెచ్చగా ఇంట్లోనే ఉండి, తను దాచుకున్న ఆహారాన్ని తింటూ సుఖంగా కాలం గడిపింది.