Facebook Twitter
హరికథ చేసిన మేలు

 

హరికథ చేసిన మేలు

 

ఒక ఊరిలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకసారి వాళ్ళఊరి గుడిలో హరికథ చెబుతున్నారు. ఆ సంగతి తెలుసుకొన్న రామయ్య, ఆ రాత్రికి గొర్రెల మందలోకి పనివాణ్ణి పంపి, తను హరికథ వినడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అతని భార్య అతనికి కొన్ని పప్పులు(పుట్నాలు) ఇచ్చి పంపింది. అయితే గొర్రెల్లో ఉండీ ఉండీ నోరాగకుండా తినటం అలవాటైంది రామయ్యకు. భార్య ఇచ్చిన పప్పులు కాసిన్నీ హరికథ చెప్పేచోటికి వెళ్ళేలోపే తినేసాడు అతను. తీరా గుడిని చేరుకొని చూస్తే, హరి కథ చెప్పే దాసుగారు ఇంకా రాలేదు. నోరాగని రామయ్య ఇక ఆగలేకపోయాడు. పప్పులకోసం తిరిగి ఇంటికి వెళ్లాడు. భార్య ఇంట్లో ఉన్న పప్పులన్నింటినీ బట్టలో కట్టి ఇచ్చింది రామయ్యకు. ఇక అతను సంతోషంగా వాటిని తినుకుంటూ హరికథకు వెళ్ళాడు. హరికథ మొదలయింది.

 

దాసుగారు "ఆఁ, అందరూ వచ్చారా? ఆఁ, అందరూ కూర్చోండి! సరే!! అయితే ఇక మొదలు పెడదామా?" అని అంటూండే లోపే, కడుపునిండా తిన్న రామయ్య నిద్రలోకి జారుకున్నాడు. హరికథంతా అయిపోయేసరికి అర్థ రాత్రయింది. అందరూ ఇళ్లకు వెళ్తుండగా మేలుకున్న రామయ్య, " ఆఁ, అందరూ వెళుతున్నారా?" అని హరికథ చెప్పే దాసుగారు అనటం మాత్రం విన్నాడు. ఇక తనూ లేచి, అందరితోపాటూ తీరికగా ఇంటికి చేరుకున్నాడు.

 

అప్పటికి సమయం ఒంటిగంటయ్యింది. సరిగ్గా అదే సమయానికి కొందరు దొంగలు రామయ్య ఇంటికి దొంగతనానికని వచ్చి ఉన్నారు. ఇంటికెళ్ళిన రామయ్యను, హరి కథలో ఏమి చెప్పారని అడిగింది భార్య. అడగ్గానే, " ఆఁ, అందరూ వచ్చారా?" అనిగట్టిగా అన్నాడు రామయ్య. అది విన్న పెరట్లోని దొంగలు తామొచ్చింది ఇంటిలోనివారికి తెలిసిపోయిందనుకొని, పొదలమాటున నక్కి కూర్చున్నారు. ఈ సారి రామయ్య, " ఆఁ! అందరూ కూర్చున్నారా?" అన్నాడు. తామొచ్చింది ఇంట్లోని వారికి ఖచ్చితంగా తెలిసిపోయిందనుకున్నారు బయటున్న దొంగలు!. ఈసారి రామయ్య "సరే! అయితే మొదలుపెడదామా! " అన్నాడు. తమను పట్టుకోవడానికి ఇంట్లోని వారందరూ వస్తున్నట్టున్నారని దొంగలంతా పారిపోతుండగా, "ఆఁ! అందరూ వెళ్ళిపోతున్నారా?" అన్నాడు రామయ్య, దాసుగారు అన్నట్లుగా. దాంతో దొంగలు హడావిడిగా కాలికి బుద్ధి చెప్పారు. హరికథను వినకుండానే రామయ్యకు అంతమేలు జరిగింది, విని ఉంటే ఏమయ్యేదో కదా!?

Courtesy..
kottapalli.in