స్టఫ్‌డ్ టమాటా బజ్జీ

 


 

 

బజ్జీ అనగానే ఆలు, మిరపకాయ, అరటికాయ ఇవే గుర్తుకొస్తాయి మనకి. కానీ, పుల్లగా వుండే టమాటాతో కూడా రుచికరమైన బజ్జీలు చేసుకోవచ్చు. ఎలాగో నేర్చుకుందాం ఈరోజు.
టమాటా బజ్జీ చేయడంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు వేడివేడి టమాటా బజ్జీ రుచిగా తినచ్చు. ఈ బజ్జీ చేయడానికి మరీ పండిన టమాటాలని కాకుండా, మరీ పచ్చివి కాకుండా మధ్యస్థంగా వున్నవాటిని ఎంచుకోవాలి. అదీ బెంగుళూరు టమాటా అయితే మంచిది. కొంచెం గట్టిగా వుంటుంది. ఈ బజ్జీ చేయడానికి కావల్సిన పదార్థాలు..

 

కావలసిన పదార్ధాలు:

టమాటాలు - పది
గరం మసాలా - ఒక చెమ్చా
ఉడికించిన ఆలు - 2
ఉప్పు - తగినంత
కారం - ఒక చెమ్చా
నూనె - పెద్ద కప్పుతో
శనగపిండి - ఒక కప్పు
డ్రై మేంగో పౌడర్ - ఒక చెమ్చా

 

తయారుచేసే విధానం:
ముందుగా టమాటాలని కడిగి, వాటి తొడిమ దగ్గర కట్ చేసి, లోపల గుజ్జునంతటినీ తీసేయాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలుని ఒక బౌల్‌లో వేసి మెత్తగా మెదపాలి. అందులో ఉప్పు, కారం, డ్రై మ్యాంగో పౌడర్, గరం మసాలా, గ్రీన్ బఠానీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని టమాటా లోపల పెట్టాలి. అలా ఒక్కో టమాటాని ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, కారం, వంటసోడా వేసి బజ్జీల పిండిలా కలుపుకుని అందులో ముందుగా రెడీచేసి పెట్టుకున్న టమాటలని ఆ పిండిలో ముంచి వేడి నూనెలో వేయించాలి. రెండు నిమిషాల్లో వేగిపోతుంది. బజజీల పిండిని మరీ జారుగా కలుపుకోకూడదు. అప్పుడే టమాటాలకి పిండి పట్టి రుచి వస్తుంది.
వేయించిన బజ్జీలని ఓ ప్లేట్‌లోకి తీసుకుని మధ్యగా చాకుతో కట్‌చేసి వడ్డిస్తే తినడానికి వీలుగా వుంటుంది. బజ్జీల పిండి, లోపల టమాటా, ఆలూ అన్నీ కలసి మంచి టేస్టీగా వుంటుంది. ఈ టమాటా  బజ్జీ ఒకసారి ట్రై చేయండి.

-రమ