పరమసాధువుగా మారిపోయిన మోదీ... కన్యాకుమారిలో మూడురోజులపాటు ధ్యాన ముద్రలోకి

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఆధ్యాత్మిక యాత్ర కోసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కన్యాకుమారికి  చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్‌ మెమోరియల్‌  వద్ద ధ్యానం లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోదీ పరమసాధువుగా మారిపోయారు. కాషాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శామియానాపై ప్రశాంత వాతావరణంలో ధ్యానంలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, మోదీ క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా కన్యాకుమారి చేరుకున్నారు.మొదట ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శించిన ప్రధాని... ఆ తర్వాత శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. ఆపై, కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడి ధ్యానమందిరంలో కూర్చున్నారు.  నిన్న సాయంత్రం నుంచి మోదీ ధ్యానం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని ధ్యానంలోనే కూర్చోనున్నారు. రేపు దేశంలో చివరిదైన ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపటితో మొత్తం ఏడు దశల పోలింగ్  పూర్తవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది
Publish Date: May 31, 2024 3:42PM

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రాబోతోందా?

ఈసారి జనరల్ ఎలక్షన్ల తొలిదశ పోలింగ్ జరిగే వరకూ కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తుంది అనే మాట అనడానికి చాలామందికి ధైర్యం చాలని పరిస్థితి. ఏ యాంగిల్లో ఆలోచించి బీజేపీ ప్రభుత్వం రాదని అనుకుంటున్నావయ్యా అని ఎవరైనా నిలదీస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకపక్క బీజేపీ వాళ్ళు గత పది సంవత్సరాలుగా దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారంటూ నినదించే గొంతులు ఎక్కువ అయ్యాయి. ఆ నినాదాలో హోరులో వున్నవాళ్ళకి వేరే ఆలోచన కూడా రాలేని పరిస్థితి. పైగా మోడీ గారు అయోధ్యలో రామాలయాన్ని కూడా ప్రారంభించేశారు కాబట్టి ఉత్తర భారతదేశం మొత్తం భక్తి పారవశ్యంలో ఊగిపోతోందని.. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, రామాలయం కట్టించిన మోడీకి అర్జెంటుగా ఓటు వేసేసి రుణం తీర్చుకోవాలా అని ఉత్తర భారతదేశంలోని ఓటర్లుందరూ ఉవ్విళ్ళూరుతున్నారని బిల్డప్పు క్రియేట్ అయింది. ఆ తర్వాత ఒక్కో దశ ఎన్నికలు ముగిసేకొద్దీ.. ఇటు దక్షిణ భారతదేశంలోగానీ, అటు ఉత్తర భారతదేశంలోగానీ మోడీ మంత్రం పెద్దగా పనిచేయలేదనే ‘వేవ్’ కనిపించింది. 400 సీట్ల మోడీ డ్రీమ్ నెరవేరే అవకాశాలు లేవేమోనన్న సందేహాలు ప్రారంభమయ్యాయి. అలా ఒక్కో భ్రమలు తొలగుతూ ప్రస్తుతం బీజేపీకి ఒంటరిగా గానీ, ఎన్డీయే కూటమికి గానీ పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదనే అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నికల ఫలితాలు అటు ఇటు ఎన్డీయే కూటమితోపాటు అటు ఇండియా కూటమి కూడా నువ్వా నేనా అనే నిలిచేలా వుంటాయని అనిపిస్తోంది. అలాంటి పరిస్థితే వస్తే ఇప్పుడున్న రెండు కూటములూ అటూ ఇటు అయ్యి కొత్త కూటములు ఏర్పడే అవకాశం వుంటుంది. పోలింగ్ సరళిని గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో వున్న పార్టీలను ఆకర్షించే పనిలో పడింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని. ‘‘తెలుగుదేశం మా పాత మిత్రపక్షమే’’ అనే కామెంట్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అంటే అర్థం ఏమిటి? ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీల కొత్త సమీకరణ అవసరమైన పక్షంలో టీడీపీని సంప్రదించడానికి మేం ఎంతమాత్రం మొహమాటపడం అని. బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రాని పక్షంలో మోడీ ప్రధానిగా మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకోవడం కష్టమే. కాంగ్రెస్ తన చాణక్యం ప్రదర్శించిందంటే, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం అసాధ్యమయ్యే అవకాశం కూడా వుంది.
Publish Date: May 31, 2024 3:26PM

ప్రధాని రేసులో మోడీ వెనక్కు..గడ్కరీ ముందుకు?

బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఉన్న ఐక్యత పదేళ్ల తరువాత మచ్చుకు కూడా కనిపించడం లేదా? అంటే బీజేపీ వర్గాలే ఔనని అంటున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న కమలం, ఆ విజయం సాధించినా ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నాయి. ఈ సారి 400 సీట్లు అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నప్పటికీ.. ఎన్డీయే కూటమికి 400 సీట్ల మాట అటుంచి, బీజేపీ సొంతంగా 250 స్థానాలు గెలవడం గగనమే అన్న పరిస్థితులున్నాయని బీజేపీలోని ఒక బలమైన వర్గం గట్టిగా చెబుతోంది.   మిత్రపక్షాల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అసరమైన స్థానాలను బీజేపీ గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదని, అదే జరిగితే.. ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని ఆ పార్టీ పొలిటికల్ మెంటర్ ఆర్ఎస్ఎస్ తన ఛాయిస్ గా తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా బీజేపీలో అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ అనుకూల, మోడీ అనుకూల వర్గాలు వేటికవిగా బలపడుతూ వస్తున్నాయి.  మోడీ, షా ఒంటెత్తు పోకడలు, ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ వంటి సీనియర్ నాయకులను మోడీ; షా ద్వయం ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతోందన్న భావన ఆర్ఎస్ఎస్ అనుకూల బీజేపీ నేతలలో బలంగా ఉంది. దేశంలో వరుసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ,షా ద్వయం తమ ఘనతేనన్నట్లుగా విస్తృత ప్రచారం చేసుకోవడం పట్ల ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ అసంతృప్తే మోడీ, ఆర్ఎస్ఎస్ మధ్య పూడ్చలేని అగాధంగా మారింది.  ఈ నేపథ్యంలోనే ఈ సారి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టగలిగే మ్యాజిక్ ఫిగర్ ను సాధించడంలో విఫలమైతే.. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినా ప్రధాని రేసులో మోడీకి పోటీగా ఆర్ఎస్ఎస్ వర్గం మరో వ్యక్తిని తీసుకువచ్చే అవకాశాలున్నాయని బీజేపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తోందా? దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉందా అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. మోడీ, షాలు పార్టీపై తమ పట్టును బలోపేతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ తో సన్నిహింగా ఉండే గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ వంటి వారిని పక్కన పెట్టిందని అంటున్నారు. అంతే కాకుండా గడ్కరీ ఓటమే లక్ష్యంగా నాగపూర్ లో తెరవెనుక పలు కుట్రలకు తెరతీసిందనీ, ఓట్ల తొలగింపు నుంచి, మోడీ నాగపర్ లో  ప్రచారం చేయకపోవడం వరకూ పలు ఉదాహరణలు చూపుతున్నారు.   ఈ నేపథ్యంలోనే ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా రాకపోతే.. మిత్రపక్షాలు కలిసివస్తే తప్ప  ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే.. ప్రధాని రేసులో మోడీ వెనుకబడి గడ్కరీ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. 
Publish Date: May 31, 2024 2:58PM

రేవంత్ ప్రతినిథులకు కేసీఆర్ నో అప్పాయింట్ మెంట్!?

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావం సదర్భంగా జూన్ 2న నిర్వహించే అధకారిక కార్యక్రమానికి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వయంగా లేఖ రాసి దానిని ప్రభుత్వ సలహాదారు హ‌ర్కార వేణుగోపాల్ కు ఇచ్చి స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను, తన లేఖను ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన, రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్లు సీఎంగా ఉన్న నాయకుడికి సముచిత గౌరవం ఇచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రభుత్వ సలహాదారు ఎంతగా ప్రయత్నించినా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వేణుగోపాల్ కు కేసీఆర్ ను కలిసి రేవంత్ లేఖ ఇచ్చి ఆహ్వానించే అవకాశం ఇంత వరకూ దొరక లేదు.  దీంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం అనుమానమే అన్న భావన వ్యక్తం అవుతోంది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్దేశంలో లేరనీ, అందుకే ప్రభుత్వ సలహాదారుకు అపపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదనీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయినా అధికారంలో ఉన్న సమయంలో కూడా కేసీఆర్  ఎవరికీ అప్పాయింట్ మెంట్ ఇచ్చే వారు కాదనీ, తనను కలుసుకోవాలని భావించే వారిని ఆయన కలిసిన దాఖలాలు లేవనీ, ఎవరినైనా తాను కలిసి మాట్లాడాలనిపిస్తే మాత్రమే కేసీఆర్ ఆయనను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడి పంపేవారని అంటున్నారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆయన ప్రజలు, నాయకులకు దగ్గర కావడానికి ఇసుమంతైనా ప్రయత్నించడం లేదని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో ఆయన ఇక పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల ద్వారానే వినిపించింది. ప్రస్తుతం అధికారం కోల్పోయి, పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమై ఉండటం చూస్తుంటే కేసీఆర్ అడుగులు రిటైర్మెంట్ దిశగా పడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పోతే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎష్ పార్టీ కూడా మూడు రోజులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనేందుకు  కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అనుకున్నా, సీఎం పంపిన ఆహ్వానాన్ని అందుకుని, తాను రాలేకపోవడానికి కారణాలను వివరిస్తూ సున్నితంగా తిరస్కరించి ఉంటే హుందాగా ఉండేదని   బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది.   
Publish Date: May 31, 2024 2:24PM

ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకారం

ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా  ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతల స్వీకారం సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ‘‘రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్విన వారికి కృతజ్ఞతలు. ఈరోజే నేను పదవీ విరమణ చేస్తాను. పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న రోజే పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందని అనుకుంటున్నాను. కారణాలు ఏమైనా ‘ఆల్ ఈజ్ వెల్’ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు.  ఇప్పటికి ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి.  ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి  ఉంటాను.  నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు . యూనిఫాంతో రిటైర్డ్ అవ్వాలనే నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నా’’ అన్నారు.
Publish Date: May 31, 2024 2:23PM

ఏబీవీకి జనం సంఘీభావం!

ఏబీ వెంకటేశ్వరరావు లాంటి నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి అంటే జగన్ ప్రభుత్వం లాంటి అడ్డగోలు ప్రభుత్వానికి గౌరవం వుండకపోవచ్చు గానీ, ఆయనలోని నిజాయితీని, సామర్థ్యాన్ని, రాజీలేని పోరాటం చేసే తీరును చూసిన ప్రజలకు మాత్రం అపారమైన గౌరవం వుంది. ఏబీ వెంకటేశ్వరరావు యూనీఫామ్‌తోనే రిటైర్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నారు. ఈ పిశాచ ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెడుతుంటే చూసి ఆగ్రహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడం పట్ల ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఐదేళ్ళపాటు వేధింపులకు గురైనప్పటికీ తాను కోరుకున్నట్టుగా ఈరోజు గౌరవప్రదంగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాలకుల అన్యాయాన్ని, అరాచకాన్ని ఎదిరించి వీరోచిత పోరాటం చేసి గెలిచిన ఏ బీ వెంకటేశ్వరరావుకు సంఘీభావం తెలపడానికి వేల సంఖ్యలో ప్రజలు  సిద్ధమవుతున్నారు. ఈరోజు, అంటే.. 31, మే శుక్రవారం నాడు విజయవాడలోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనరేట్ వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. అక్కడ ఏబీ వెంకటేశ్వరరావుని కలిసి అభినందనలు తెలపడానికి సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మన కోసం, తెగించి పోరాడే వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహించడం మన కనీస ధర్మం అని... ఏబీ వెంకటేశ్వరరావుని అభినందించడానికి బంధుమిత్ర సమేతంగా రండి అని ఆహ్వానిస్తున్నారు.
Publish Date: May 31, 2024 12:37PM