Read more!

రేవంత్ గ్యాంగ్ వర్సెస్ ఉత్తమ్ టీమ్

పాలమూరు రెడ్లు వర్సెస్ నల్గొండ రెడ్లు. అవును, మీరు చదివింది నిజమే. కాంగ్రెస్ లో ఇప్పుడు అలానే జరుగుతోంది. రెడ్డి నాయకులు జిల్లాల వారీగా విడిపోయారు. ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారి కోల్డ్ వార్ పీక్స్ కు చేరింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి బరిలో నిలిచారు. ఆయనను గెలిపించే బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీసుకున్నారు. 

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి రాములు నాయక్ పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హస్తం పార్టీ పెద్దలు.. అందులోని రెండు జిల్లాలకు చెందిన రెడ్డి నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో నడుస్తున్న కోల్డ్ వార్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరోసారి బయటపడుతోందని చెబుతున్నారు.

పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని.. ఒకవేళ విజయం దక్కకపోయినా.. ఓట్ల సంఖ్య భారీగా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చిన్నారెడ్డి గెలుపు కోసం మరో పాలమూరు నేత రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కుదిరితే చిన్నారెడ్డిని గెలిపించడం.. కుదరకపోతే రాములు నాయక్ కంటే అధికంగా ఓట్లు సంపాదించడం.. ఇదే రేవంత్ టార్గెట్. 

అటు, వరంగల్ పరిధిలోనూ ఉత్తమ్, కోమటిరెడ్డి ఇదే లక్ష్యంతో పని చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం మూడు జిల్లాల పరిధిలో పర్యటిస్తున్నారు. అయితే, రేవంత్ ప్రధాన అనుచరురాలైన సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు మీటింగ్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు ఇది నిదర్శనం. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలు తమ పరిధిలోని ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి ఢిల్లీకి తమ బలమెంతో చూపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ రాములు నాయక్ గెలవకపోయినా.. కనీసం చిన్నారెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా చాలనేది వారి మనసులో మాటని అంటున్నారు. ఇలా, అభ్యర్థి గెలుపుకంటే కూడా పక్క నియోజకవర్గంలోని పోటీదారుకంటే ఎక్కువ ఓట్లు వస్తే చాలన్నట్టు నేతల ప్రచార తీరు సాగుతోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలతో కాంగ్రెస్ లో కోల్డ్ వార్.. హీట్ పుట్టిస్తోంది. పాలమూరు రెడ్లు వర్సెస్ నల్గొండ రెడ్లుగా ఈ ఆధిపత్య పోరు నడుస్తోంది. పాలమూరు రెడ్లను రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుంటే.. ఉత్తమ్, కోమటిరెడ్డి నల్గొండ రెడ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరి బలం ఎంతో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేసులో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఓట్ల శాతంతో తన సత్తాను ఢిల్లీకి ఘనంగా చాటాలని చూస్తున్నారు. అందుకు, కౌంటర్ గా నల్గొండ రెడ్డి టీమ్ కూడా రాములు నాయక్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. ఇలా.. ఒకే పార్టీలోని రెండు రెడ్డి వర్గాలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతుండటంతో తెలంగాణలో హస్తం పార్టీ పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. మరి ఈ రెడ్డి ఫైట్ లో గెలిచేదెవరో? నిలిచేదెవరో? రేవంత్ రెడ్డా? ఉత్తమ్ అండ్ టీమా?