TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ వెబ్ లోకి చొరబడిన ఏఐ: రూమ్ బుక్ చేయడానికి చాట్ జీపీటీ యత్నం.!

Published on: Tue Sep 29, 2026 3:32PM

ఏఐ సాంకేతికత రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్నప్పటికీ, అదే స్థాయిలో రక్షణ సవాళ్లను కూడా తెచ్చిపెడుతోంది. తాజాగా ఏఐ ఏజెంట్ల ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి ప్రవేశించడం, సెక్యూరిటీ నిబంధనలను అతిక్రమించేందుకు ప్రయత్నించడం లాంటి ఘటనలు టెక్ ప్రపంచంలో కలకలం రేపిన సంగతి  తెలిసిందే. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఓ గదిని బుక్ చేయడానికి  చాట్‌జీపీటీ-6 అస్త్రా' అనే   ఏఐ ఏజెంట్ చేసిన విఫల యత్నం వెలుగులోకి వచ్చింది. 

సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన   వీడియో ప్రకారం, టెక్ ప్రియుడైన ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పంచుకున్నారు. డిసెంబర్ 21న తిరుమలలో వసతి గదిని బుక్ చేసుకోవాలని ఆయన  చాట్‌జీపీటీ-6 అస్త్రా ఏఐ ఏజెంట్‌ను కోరారు. యూజర్ ఇచ్చిన లాగిన్ వివరాలను ఉపయోగించుకున్న ఆ ఏఐ ఏజెంట్, నేరుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి అందుబాటులో ఉన్న ఆప్షన్లను పరిశీలించింది.

వెబ్‌సైట్‌లో కావాల్సిన వివరాలను ఎంచుకుంటూ,  ఏజెంట్ బుకింగ్ ప్రక్రియను దాదాపు చివరి అంకం వరకు  తీసుకువెళ్లింది. అయితే, చెల్లింపుల  దశకు చేరుకునేసరికి ఎలాంటి బ్యాంక్ లేదా కార్డు వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రక్రియ పూర్తికాకుండా ఆగిపోయింది. మానవ ప్రమేయం లేకుండా కేవలం ఆదేశాల ఆధారంగానే వెబ్‌సైట్లలో నావిగేట్ చేస్తూ పనులను పూర్తి చేసే ఏఐ సామర్థ్యాలు ఈ ఉదంతంతో మరోసారి వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై స్పందించిన టీటీడీ ఐటీ అధికారులు మాట్లాడుతూ.. ముందుగా సరైన దర్శన టికెట్ లేకుండా టీటీడీ వెబ్‌సైట్‌లో వసతి గదిని బుక్ చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే ఏఐ ఏజెంట్ చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి కన్ఫర్మ్డ్ బుకింగ్‌కు దారితీయలేదన్నారు. అయినప్పటికీ, ప్రముఖ సంస్థల ఏఐ బాట్లు ప్రభుత్వ వెబ్‌సైట్ల భద్రతా వలయాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న తీరు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. 

గతంలోనూ ఓపెన్‌ఏఐకి చెందిన బాట్లు పలు ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి చొరబడి సమాచారాన్ని సేకరించిన వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  రానున్న రోజులలో ఏఐ స్వయంప్రతిపత్తి మరింతపెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైబర్ భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మరింత పటిష్టమైన   నిబంధనలను  అమలు చేయాలని   టెక్ నిపుణులు అంటున్నారు. 

[ChatGPT-6 Astra, TTD website, Room Booking, Tirumala Accommodation AI agent, AI security concerns,  Telugu News Technology Updates, Telugu One]