TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం.. భర్తతో ఏం చెప్పాలి..ఏం చెప్పకూడదు.!

Published on: Sat Oct 24, 2026 2:37PM

ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం.. భర్తతో ఏం చెప్పాలి..ఏం చెప్పకూడదు.!

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని, ప్రతి విషయం ఒకరితో ఒకరు పంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, భర్తతో ఏ విషయాలు పంచుకోవాలి, ఏ విషయాలు పంచుకోకూడదు అనే దానిపై కొంత విజ్ఞత పాటించడం చాలా ముఖ్యం. ప్రతి భార్య తమ కాపురాన్ని మరింత సంతోషంగా ఉంచుకోవడానికి భర్తతో ఏ విషయాలు చెప్పాలి? ఏ విషయాలు చెప్పకూడదు?  వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే..

వ్యక్తిగత అభిరుచులు , స్పేస్..

పెళ్లి అయ్యాక కూడా ప్రతి ఒక్కరికీ వారి సొంత ఇష్టాలు, అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. తమకు నచ్చిన దుస్తులు ధరించడం, స్నేహితులతో కొంత సమయం గడపడం లేదా వ్యక్తిగత ఆసక్తులను అనుసరించడం చాలా సాధారణమైన విషయం. వీటి కోసం ఏదో తప్పు చేస్తున్న వాళ్లలా ఫీల్ కావాల్సిన  అవసరం లేదు. భర్తతో ఈ విషయాల గురించి మనసు విప్పి మాట్లాడితే ఇద్దరూ ఒకరికొకరు వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ సంతోషంగా ఉండవచ్చు.

బంధువులు లేదా స్నేహితుల రహస్యాలు..

ఎవరో తమ స్నేహితురాలూ లేదా బంధువు తమపై నమ్మకంతో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకొని ఉండవచ్చు. అలాంటి విషయాలను అనుమతి లేకుండా ఇతరులతో, ముఖ్యంగా భర్తతో చెప్పడం సరికాదు. ఎదుటివారి వ్యక్తిగత గోప్యతను గౌరవించడం చాలా అవసరం. అయితే, ఎవరికైనా ఎలాంటిదైనా తీవ్రమైన ప్రమాదం లేదా ప్రొటెక్షన్ కు సంబంధించిన,  సహాయం కోసం అర్థించడం వంటి సమస్య ఉంటే అప్పుడు భర్తతో  మాట్లాడటంలో తప్పులేదు.

పాతకాలపు జ్ఞాపకాలు లేదా సంబంధాలు..

పెళ్లికి ముందు ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. ఆ వ్యక్తిగత గతానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని భర్తకు పూసగుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రస్తుత జీవితంతో ఎలాంటి సంబంధం లేని విషయాలను అనవసరంగా మాట్లాడటం వల్ల మనసుల్లో చిన్నపాటి అపార్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గతానికి సంబంధించిన విషయాలు ప్రస్తుత కాపురాన్ని, ఆరోగ్యాన్ని లేదా భద్రతను ప్రభావితం చేసేలా ఉంటే మాత్రం నిజాయితీగా స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది.

కోపంలో మాటలను మనసులో పెట్టుకోకూడదు..

కొన్నిసార్లు చిన్నపాటి మనస్పర్థల వల్ల లేదా కోపం కారణంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగవచ్చు. ఆ సమయంలో ఇద్దరూ కోపంతో కొన్ని మాటలు అనడం సాధారణం. ఆ కోపపు మాటలను జీవితాంతం మనసులో ఉంచుకొని ప్రతిసారీ గుర్తుచేయడం వల్ల బంధం బలహీనపడుతుంది. ఆవేశం తగ్గాక ప్రశాంతంగా కూర్చుని అసలు సమస్య ఏమిటో మాట్లాడుకోవడం ఎప్పుడూ మంచిది.

ప్రతి చిన్న ఆందోళనను వెంటనే చెప్పాలనుకోవడం..

ఏదైనా సమస్య వచ్చిన వెంటనే దాని గురించి ఆలోచించి ఒత్తిడికి గురికావాల్సిన పనిలేదు. ప్రతి మనిషికి తమ మనసులోని భావాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. భార్య ఏదైనా చిన్న విషయంతో ఇబ్బంది పడుతుంటే, ముందుగా తనను తాను శాంతపరచుకొని, సరైన సమయం చూసి భర్తతో ఆ విషయం గురించి మాట్లాడవచ్చు. అయితే ఏ విషయాన్నీ చాలాకాలం పాటు మనసులోనే దాచుకోవడం కూడా మంచిది కాదు, సరైన సమయంలో భర్తతో షేర్ చేసుకోవడం  వల్ల మనసు తేలికవుతుంది.

సంతోషకరమైన కాపురానికి సూత్రం..

భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయం దాచడం లేదా ప్రతిదీ చెప్పాలనే ఒత్తిడి పెట్టుకోవడం రెండు పద్ధతులూ సరైనవి కావు. ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, కుటుంబ నిర్ణయాలు వంటి ముఖ్యమైన విషయాల్లో నిజాయితీగా ఉండటం ఎంత అవసరమో, పర్సనల్  స్పేస్ ను, ఇతరుల ప్రైవసీని  గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సరిహద్దులను మరొకరు గౌరవించుకుంటే ఆ బంధం ఎల్లప్పుడూ కలకాలం పదిలంగా ఉంటుంది.

                                    *రూపశ్రీ.