రేవంత్ దూకుడు.. ట్రబుల్ లో ట్రబుల్ షూటర్.!
Published on: Fri Sep 18, 2026 10:41AM

తెలంగాణ రాజకీయాలలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాల ముందు నిలవలేక సతమతమవుతున్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే రేవంత్ రెడ్డి ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తున్నారనుకోవడం సరికాదంటున్నారు. గతంలో అధికారంలో లేని సమయంలో కూడా రేవంత్ రెడ్డి తగ్గేదేలే అన్నట్లుగానే వ్యవహరించారనీ, అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. జైలకు కూడా పంపింది. అయినా అప్పట్లో ఏ సందర్భంలోనూ రేవంత్ వెనకడుగు వేయలేదు. తన పంథా మార్చుకోలేదు. అలాంటి పోరాట పటిమ ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండటంతో అసెంబ్లీ వేదికగానైనా, బయట బహిరంగ వేదికలైనా ఆయన సంధిస్తున్న విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాను ఆశ్రయించడానికే పరిమితమౌతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ దూకుడును అడ్డుకుంటారని హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నారు. అయితే హరీష్ రావు కూడా సీఎం రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడలను తిప్పికొట్టడంలో విఫలమౌతున్నారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమౌతోంది. హరీష్ రావుపై వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. అయితే.. ఇటీవల తెరపైకి వచ్చిన మిల్చీ మిల్క్ డెయిరీ వ్యవహారం, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన వేల ఎకరాల భూముల చిట్టాలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పక్కా అధికారిక రికార్డులు, సర్వే నంబర్లు, కచ్చితమైన కాలపరిమితులతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను నేరుగా బయటపెడుతూ బీఆర్ఎస్ అగ్రనేతల సమగ్రతను సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ను కష్టకాలంలో ఆదుకుంటూ వచ్చిన సెంటిమెంట్ రేవంత్ దూకుడు ముందు పని చేయడం లేదు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో వస్తున్న మార్పులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం వాగ్ధాటికి పరిమితం కాకుండా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండటంతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
[Harish Rao vs Revanth Reddy, Telangana politics, BRS strategy, Revanth Reddy moves, Touble Shooter, Telugu One]


