TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసు: వరుసగా రెండో రోజూ సునీల్ యాదవ్ ను విచారిస్తున్న ఈడీ.!

Published on: Fri Sep 25, 2026 12:59PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ ఉదంతంలో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ  ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం (సెప్టెంబర్ 25) వరుసగా రెండో రోజు  విచారిస్తోంది. హత్య జరిగిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆర్థిక లావాదేవీలు,  అనుమానాస్పద చెల్లింపులపై ఈడీ అధికారులు అనీల్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి చురుగ్గా కదులుతున్న ఈడీ అధికారులు, నిందితుడిని  వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగానే మొదటి రోజు అంటే గురువారం (సెప్టెంబర్ 24)   తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు హత్యకు  కారణాలు, నేరానికి ముందు, తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు,  తెరవెనుక ఉన్న వ్యక్తుల ప్రమేయంపై సునీల్ యాదవ్‌ను  ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు   గోప్యంగా ఉంచుతూనే, కీలకమైన డాక్యుమెంట్ల ఆధారంగా వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేవలం నేరస్థుల కోణమే కాకుండా, పెద్ద  నగదు బదిలీ జరిగి ఉండొచ్చనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద కేసు నమోదు చేసిన ఈడీ..  దర్యాప్తును ఆర్థిక కోణంలో ముందుకు తీసుకువెళుతోంది. నేరానికి అవసరమైన నిధులు ఎవరి నుంచి సమకూరాయి, ఆర్థిక ఒప్పందాలు ఏ రీతిలో జరిగాయనే విషయాలపై నిందితుడిని ఈడీ ప్రశ్నిస్తున్నది.  


[YS Vivekananda Reddy Murder Case, Sunil Yadav ED inquiry, Money Laundering Probe, Hyderabad ED office, AP politics, Telugu One]