TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ వివేకా హత్య కేసు: ఈడీ దూకుడు.. అవినాష్ రెడ్డి సహా పలువురి నివాసాలలో సోదాలు.!

Published on: Fri Sep 25, 2026 9:46AM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది.   మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద పలు ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఉమ్మడి కడప జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని పలు  ప్రాంతాలలో   నిందితుల నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది.

 గతంలో  ఈ కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్,  ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది.  ప్రధానంగా వివేకా హత్యకు  పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం జరిగినట్లు వస్తున్న ఆరోపణలు, హవాలా లావాదేవీలు,  ఆర్థిక మూలాలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతరుల నివాసాలలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.

 ఈ సందర్భంగా ఈడీ  డిజిటల్ పరికరాలతో పాటుకీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ప్రాంతాలలో లెక్కల్లో చూపని నగదు,  బ్యాంకు లాకర్లకు సంబంధించిన తాళాలను గుర్తించి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.  హత్యకు ముందు,  తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీల వెనుక అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో  ఈ దర్యాప్తు సాగుతున్నది. 

వివేకా హత్యకు సంబంధించి సీబీఐ తన దర్యాప్తులో భాగంగా గతంలోనే పలువురిని అరెస్టు చేసి   ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలిన నేపథ్యంలో..  నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి ఎలా చేరాయి అన్న కోణంలో ఈడీ దర్యాప్తు సాగుతోంది.

తాజాగా ఈడీ సోదాలు ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారాయి.  ఇప్పటికే ఈ కేసు విచారణ వివిధ న్యాయస్థానాల పరిధిలో  సాగుతున్న సంగతి విదితమే.  తాజాగా ఇదే కేసులో ఈడీ ఆర్థిక   కోణాలను వెలికి తేసే దిశగా దూకుడు ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

[YS Vivekananda Reddy, Murder Case,  ED Investigation, Kadapa MP Avinash Reddy, PMLA Case, CBI Chargesheet, Raids, Telugu One]