అడ్డెడ్డే.. పదేళ్ళలో ఎన్ని మార్పులు?

అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ పోటీలో నిలిచారు. ఆరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పులివెందులలోని జగన్ ఇంట్లోంచి ఓ కారు బయటకి వచ్చింది. వెనుక సీట్లో ఇద్దరు మహిళా మూర్తులు కూర్చుని వున్నారు. వారిద్దరూ ఎవరో కాదు.. ఒకరు జగన్ భార్య భారతి, మరొకరు జగన్ చెల్లెలు షర్మిల. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. జగన్‌దే విజయం అనే విశ్వాసం వారి ముఖాల్లో కనిపించింది. కార్లో వాళ్ళిద్దర్నీ చూసిన పులివెందుల వాసుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. వైఎస్ కుటుంబం అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. ఇద్దరూ ప్రయాణించిన కారు పోలింగ్ బూత్‌కి చేరుకుంటూ. వదినా మరదళ్ళు ఇద్దరూ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళి ఓటు వేసి బయటకి వచ్చారు. అప్పటికే బయట ఫొటోగ్రాఫర్లందరూ ఫొటోలు క్లిక్ చేయడానికి రెడీగా వున్నారు. వదినా మరదళ్ళు ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు నిల్చున్నారు. ఇద్దరూ ఇంకు మార్కు వున్న వేళ్ళని ఫొటోగ్రాఫర్లకు చూపించారు. వదిన అంటే ఎంతో చనువు వున్న షర్మిల భారతి భుజం మీద చెయ్యి వేసింది. వాళ్ళ స్నేహబంధాన్ని మీడియా వాళ్ళు, అక్కడ వున్న జనం అబ్బురంగా చూశారు.

పదేళ్ళ కాలం గిర్రున తిరిగింది. అనుబంధాలకు మధ్య ఆస్తులు అనే అడ్డుగోడలు లేచాయి. అన్నా చెల్లెళ్ళ అనుబంధం అడుగంటిపోయింది. వదిన మరదళ్ళ ఆప్యాయత ఆవిరైపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం, ఈ కుటుంబం బద్ధ శత్రువులు. భుజాల మీద చేతులు వేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఒకరి మీద మరొకరులు విమర్శలు కురిపిస్తున్నారు. ఒకరి పరువు మరొకరు రోడ్డు మీదకి ఎక్కిస్తున్నారు.