తెలంగాణలో మళ్లీ భారీవర్షం 

తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.పిడుగులు పడే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మే 17 వరకు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణ పేట జిల్లాల్లో బుధవారం రోజు వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో వర్షం పడే అవకాశం ఉంది.ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతుందని, ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. ఇలా రాష్ట్రమంతా భిన్నమైన వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండవేడిమికి ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలోనే పూర్తిచేసుకోవాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటలకు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా గొడుగు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.