TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్‌ బలోపేతమే ఏకైక అజెండా.. షర్మిల.!

Published on: Sat Sep 19, 2026 4:25PM

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం, రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీ సత్తా చాటేలా కార్యాచరణ రూపొందించడంపై విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం (సెప్టెంబర్19) కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా కార్యాచరణ రూపొందించడంపై  చర్చించారు.  

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ పీవీ మోహన్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిలా రెడ్డి జూమ్‌ కాల్‌ ద్వారా ఈ సమావేశంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలన్నారు.  రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావాలని వైఎస్‌ఆర్‌ ఆకాంక్షించారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆశయాన్ని నెరవేర్చేలా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. 

దేశంలో కాంగ్రెస్‌ ఒక్కటే సెక్యులర్‌ పార్టీ అనీ, కాంగ్రెస్‌ అంటే సమానత్వం, లౌకికవాదమని పేర్కొన్న షర్మిల.. పేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు.  రాష్ట్రంలో అధికార కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ రెండూ మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించిన షర్మిల తెలుగుదేశం, వైసీపీలపై  ప్రజల్లో తీవ్ర అసహనం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ఎదగాల్సిన అవసరం ఉందనీ,  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన బలాన్ని చాటుకోవాలని సూచించారు.

పార్టీలో   గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని షర్మిల సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతోపాటు ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికలను బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. పార్టీ శ్రేణుల ముందున్న ఏకైక అజెండా కాంగ్రెస్‌ బలోపేతమే కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పీవీ మోహన్‌ రావడం హర్షణీయమన్న షర్మిల,  ఆయన సూచనలు, సలహాలతో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. అలాగే పీవీ మోహన్‌ సీనియారిటీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతానికి ఉపయోగపడుతుందనీ,  ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌కు పూర్తి సహకారం అందేలా పీవీ మోహన్‌ కృషి చేయాలని ఆమె కోరారు.


[YS Sharmila,AP Congress, Local Body Elections, APCC  Chief, PV Mohan, Congress PAC  Meeting]