కుమార్తె వివాహ శుభలేక ఇవ్వడం వరకే.. జగన్ తో సయోధ్యపై షర్మిల క్లారిటీ.!
Published on: Tue Sep 22, 2026 3:08PM

వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ, కుటుంబ వివాదాలు, విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నేపథ్యంలో జగన్‌ను ఆమె కలిశారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిరువురి మధ్యా సయోధ్య కుదిరిందనీ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే వీటన్నిటినీ ఖండిస్తూ షర్మిల జగన్ తో తన విభేదాలు కొనసాగుతున్నాయని పరోక్షంగానైనా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను జగన్ ను కలిసిన మాట వాస్తవమేననీ, అయితే అది కేవలం తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికేనని విస్పష్టంగా చెప్పారు. తాను జగన్ తో భేటీకి ఎటువంటి రాజకీయ కోణం లేదని కుండబద్దలు కొట్టేశారు.
జగన్-షర్మిల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, ఆస్తుల వివాదం కారణంగా గత కొన్నేళ్లుగా ఏ సందర్భంలోనైనా ఒకే సందర్భంలో ఇరువురరూ కనిపిస్తే.. రాజకీయ అర్థాలు వెతకడం మామూలైపోయింది. వారి తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇరువురూ ఇడుపుల పాయలో కలిస్తే.. ఇంకేముందు జగన్, షర్మిల మధ్య సయోధ్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే షర్మిల తన కుమార్తె వివాహానికి జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లడంతో మరోసారి ఆ ప్రాచారం ఉధృతమైంది.

ఈ నేపథ్యంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చారు. జగన్‌ను తాను గతంలో ఎప్పుడు కలిశారు, ఇప్పుడు ఎందుకు కలిశారన్న దానిపై ఆమె పూర్తి స్పష్టత ఇచ్చారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలో జగన్‌ను కలిశాననీ, ఆ తరువాత ఇదిగో ఇప్పుడు, తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి కలిశాననీ విస్పష్టంగా చెప్పారు.
తమ కుటుంబంలో శుభకార్యానికి జగన్ నుఆహ్వానించడాన్ని రాజకీయ పరిణామంగా చూడకూడదన్నది షర్మిల అన్నారు. , తన కుమార్తె పెళ్లికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని, ఆ క్రమంలోనే జగన్ నూ ఆహ్వానించాననీ పేర్కొన్న షర్మిల ఇందులో ప్రత్యేకం ఏమీ లేదన్నారు. షర్మిల తాజాగా ఇచ్చిన క్లారిటీలో కుటుంబ శుభకార్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసినట్లైంది. తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.
[YS Sharmila, Daughter Marriege, Invitation, YS Jagan Mohan Reddy, YS Anjili Reddy wedding, APCC Chief Sharmila, TeluguOne]


