TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి: ప్రమీలమ్మ నామినేషన్.!

Published on: Sat Oct 17, 2026 10:37AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం  అయ్యింది. శుక్రవారం (అక్టోబర్ 16) నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ అయ్యింది. ఈ నేపథ్యంలో   కడప జిల్లాలోని రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న పులివెందుల మున్సిపాలిటీలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్  చిన్నమ్మ,  ప్రమీలమ్మ    నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఈ సారి పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ చేయడంతో  వైసీపీ అధినేత  అనుభవజ్ఞురాలైన వైఎస్ ప్రమీలమ్మ పేరును ఖరారు చేశారు. గతంలోనూ పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆమెకు ఉండటంతో, పార్టీ   ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి బరిలోకి దింపింది. నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో ఆమె వెంట పెద్ద సంఖ్యలో ఆమె మద్దతు దారులు మునిసిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.     ప్రమీలమ్మతో పాటు వివిధ వార్డుల నుంచి పోటీ పడుతున్న పలువురు వైసీపీ అభ్యర్థులు కూడా తొలిరోజే  అంటే శుక్రవారం (అక్టోబర్ 16) తమ నామినేషన్ లు దాఖలు చేశారు.  

అదలా ఉంటే పులివెందుల మునిసిపల్ ఎన్నికలలో ఈ సారి పోటీ తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ తరఫున వైఎస్ ప్రమీలమ్మ బరిలో నిలవగా, అధికార  తెలుగుదేశం కూటమి తరఫున తుగుట్ల గీతా కుమారి పోటీ చేస్తున్నారు.

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ప్రవేశం కల్పించారు. దీంతో కార్యాలయం వెలుపలే పెద్ద సంఖ్యలో వైసీపీ  నాయకులు, కార్యకర్తలు గుమిగూడి తమ మద్దతు తెలియజేశారు.

పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టును నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంటే..  ఈసారి  పులివెందుల కోటను బద్దలు కొట్టి బోణీ కొట్టాలని తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.  ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులోనూ హోరాహోరీ పోరు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.  

[YS Pramila Nomination Pulivendula Municipal Chairperson,   YCP Pulivendula Candidate, YS Prameelamma, AP Local Body Elections, Telugu One]