జగన్‌ను చివరిసారిగా కలిసింది ఆరోజే.. ప్రచారానికి షర్మిల క్లారిటీ..!
Published on: Tue Sep 22, 2026 3:03PM
.webp)
తన రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను ఇతర రాజకీయ నేతలను కలుస్తున్నానని, రాజకీయంగా మరో పార్టీలోకి వెళ్లబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన షర్మిల.. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆధారాలు లేని విశ్లేషణలు, ఆరోపణలతో తన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకే కలిశానని షర్మిల తెలిపారు. ప్రస్తుతం మరోసారి జగన్‌ను కలిసినట్లయితే.. అది కూడా తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకేనని స్పష్టం చేశారు. తన కుమార్తె వివాహానికి రాజకీయ భేదాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్లు షర్మిల వెల్లడించారు. తన బిడ్డ పెళ్లికి రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం సాధారణ విషయమేనని, దానికి రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు.

కుమార్తె వివాహాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు. శుభకార్యాన్ని రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి తనపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సహించబోనని హెచ్చరించారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహానికి తెలుగు ప్రజలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని వైఎస్ షర్మిలా రెడ్డి కోరారు.
[ YS Jagan, YS Sharmila, Jagan Sharmila, YS Sharmila News, Jagan News, AP Politics, Andhra Pradesh Politics, YSR Congress, Congress Party, Sharmila Statement, Jagan Meeting, Political News, AP Congress, YS Anjili Reddy ]


