వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్.. అయితే షరతులు వర్తిస్తాయి.!
Published on: Sat Sep 19, 2026 10:34AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు, అలాగే కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటంచే నిమిత్తం పాతిక రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి నవంబర్ 30 లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే పలు షరతులు కూడా విధించింది.

అక్రమాస్తుల కేసులలో నిందితుడిగా ఉండటం, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండటంతో, వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. కాగా కోర్టు జగన్ యూరప్ పర్యటనకు విధించిన షరతులు ఇలా ఉన్నాయి. జగన్ యూరప్ పర్యటనకు బయలుదేరే ముందే పూర్తి పర్యటన షెడ్యూల్‌ను సీబీఐ అధికారులకు అందజేయాలి.
అలాగే విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావుడి మరియు రాజకీయ పరిణామాల వేళ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
[YS Jagan, CBI Court, Europe Tour, YCP, Andhra Pradesh News, Jagan Foreign Travel, Green Signal, Conditions Apply]


