బొత్స ఇలాకాలో వైసీపీ జీరో: వలసలు, సస్పెన్షన్లు.. అసలేం జరుగుతోంది.?
Published on: Sat Oct 3, 2026 2:55PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
.webp)
తాజాగా మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు. పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు. సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.
.webp)
మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ పార్టీ నుంచే సస్పెండ్ చేసింది.
స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
.webp)
జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు.
[YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]


