తెలుగుదేశం మేనిఫెస్టోపై అవాస్తవ ప్రచారంతో వైసీపీ నవ్వులపాలు!

ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో  ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తెలగుదేశం మేనిఫెస్టో 2024ను   ఆ పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిందంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది.

తెలుగుదేశం, వైసీపీ మేనిఫెస్లోలు విడుదల చేసినప్పటికీ, వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలలో స్పందన కనిపించలేదు. ఆ మేనిఫెస్టోపై కనీసం చర్చ కూడా జరగలేదు. అందుకు భిన్నంగా తెలుగుదేశం మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించింది. ఆ పార్టీ గ్యారెంటీలపై ప్రజలలో విశ్వాసం కనిపించింది.  తెలుగుదేశం మేనిఫెస్టో కూటమికి బ్రహ్మాండమైన మైలేజీని తీసుకువచ్చింది. అదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో పట్ల సర్వత్రా పెదవి విరుపే కనిపించింది. దీంతో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చి హామీల అమలు సాధ్యం కాదంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్  ప్రచారానికి తెరలేపింది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం కూటమిని మించి విపక్ష పార్టీ మేనిఫెస్టోకు ప్రచారం కల్పించింది. అది ఫలించలేదని గ్రహించిన వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం తన వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించేసిందంటూ  వదంతులను వ్యాప్తి చేయడానికి తెరతీసింది.

ఇందుకు నిదర్శనమంటూ తెలుగుదేశం వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.  ఆ స్క్రిన్ షాట్ ఏమిటంటే.. పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని కనిపిస్తోంది. అయితే వాస్తవం ఏమిటంటే..  తప్పు యూఆర్ఎల్ ను టైప్ చేసి ఎర్రర్ మెసేజ్ వచ్చిన స్క్రీన్ షాట్ ను  వైసీపీ వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది.  తెలుగుదేశం వెబ్ సైట్ హోం పేజ్ ఓపెన్ కాగానే ఆ పార్టీ మేనిఫెస్టో డిస్ ప్లే అవుతోంది. అయినా సరిగ్గా ఎన్నికల వేళ ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోను తొలగించదన్న కనీస ఇంగితాన్ని కూడా వైసీపీ కోల్పోయిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అవాస్తవ ప్రచారంలో ఎన్నికల గండం గట్టెక్కేందుకు  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యి ఆ పార్టీనే నవ్వుల పాలు చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.