TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందుల కోటకు బీటలు.. జగన్ పొలిటికల్ ఫ్యూచర్ కు సంకేతాలు.!

Published on: Wed Nov 4, 2026 8:48AM

పులివెందులలో నాలుగు దశాబ్దాల  వైఎస్ కుటుంబ పాలనకు గండి పడింది.  పులివెందుల మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం వ్యక్తిగతంగా తనకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రయత్నించినా జగన్ పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు.  అసలు గతంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఘోరంగా పరాజయం పాలైన రోజే పులివెందులపై జగన్ పట్టు సడలిందన్న సంగతి తేటతెల్లమైంది.  2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 

​పులివెందుల ప్రజలే కాదు, యావత్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలో ఆయనే చెప్పాలి. అధికారంలో లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఉండరు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మకాం వేసి, అతిథి మాదిరిగా వచ్చిపోతూ ఉంటారు. నిజంగా పులివెందులలో పట్టు నిలుపుకోవాలంటే ఆయన చేయవలసిన ప్రయత్నాల పట్ల ఆయనకే స్పష్టత లేదు. తన పార్టీ కార్యకర్తల్లో ఆయన మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలేదు.  ఒకరకంగా చెప్పాలంటే ప్రయత్నం చేసే ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్లు కనిపించదు.  

​ఎన్నికకు ముందు రోజు వచ్చి పులివెందులలో ఉండి ఎన్నికను నడిపిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎన్నిక రోజు ఒంటిగంటకు వస్తానని తన హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ నాటకీయంగా పదిగంటలకే హెలికాప్టర్ అక్కడకు చేరేలాగా ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎగరడం మొదలుపెట్టాడు. ముందస్తు సమాచారం ఇవ్వకపోతే   గందరగోళం అవుతుందని ఆయనకు   తెలుసు. జగన్ మోహన్ రెడ్డి కోరుకునేది అటువంటి అయోమయ పరిస్థితినే. తన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కూడా ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది అని చెప్పాలనేది ఆయన ప్రయత్నమని పులివెందులలో చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. ఆయన రాజకీయ జీవితం మొదలైన దగ్గర్నుంచీ ఇదే నాటకీయత. అయినా ఒంటిగంటకు వచ్చి ఆయన ఎన్నికలను ఏమి శాసిస్తారు?
​పులివెందులలో ఉండి కూడా ఓటు వేయని జగన్  ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడతారు?  ప్రభుత్వం అరాచకం చేస్తున్నది అని పోరాటం చేయాలనుకున్నా ప్రజాస్వామ్యంలో అతి విలువైన ఓటు హక్కును ఉపయోగించుకుని అప్పుడు ధర్నాకు దిగవచ్చు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయడానికి వెళ్లాలన్నా కాన్వాయ్ కావాలి. అధికార దర్పం, పటాటోపం అంటే ఆయనకు అమితమైన ఆసక్తి. ఆయన ధర్నా చేయడానికి లోపల కూర్చున్న ఏజెంట్లే దిక్కయ్యారంటే పులివెందులలో జగన్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అవగతమౌతుంది.  

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకుంది. ఈ క్రమంలో టీడీపీ  కొంత క్రమశిక్షణ తప్పినా వైసీపీకి సానుభూతి రాకపోవడానికి కారణం జగన్ అధికారంలో ఉన్నప్పటి చర్యలే కారణాలని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను జగన్‌కు ఒక గుణపాఠంగా చూపించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందని, 2024 లో తాను ఓటమి చెందినప్పుడే జగన్ మోహన్ రెడ్డికి తెలుసు.  

భయంకరమైన ఓటమిని చూసిన రోజు, ముఖ్యంగా తాను నిలబెట్టాలనుకున్న రాజధాని ప్రాంతం కూడా తనను కాదన్న రోజు చంద్రబాబు పోరాడి గెలిచిన విధానాన్ని చూసి కూడా జగన్..  ఇప్పటికీ తన గెలుపు ప్రజల బాధ్యత అనుకుంటున్నారు. దార్శనికుడు అని పేరున్న చంద్రబాబు లాంటివాడికే ఎన్నికల్లో కుస్తీ పట్టక తప్పడం లేదు, తాయిలాలు ప్రకటించక తప్పడం లేదు. అలాంటిది తన మాటమీద తనకే నిలకడ లేని జగన్   ప్రజలే తనను గెలిపించాలనీ, నిలబెట్టాలనీ ఆయన ఎలా అనుకుంటున్నారన్నది ఆయనకే తెలియాలి.

​పులివెందుల ప్రజలు తనపట్ల ఉన్న అసంతృప్తిని తాను అధికారంలో ఉన్నప్పటి నుండే వ్యక్తపరుస్తున్నారు. తనకు కూడా గతంలో వచ్చినంత మెజారిటీ రానప్పుడే జగన్ విషయం అర్ధం చేసుకుని ఉంాలి.   కానీ జగన్ అలా అనుకోవడం లేదు. జగన్ విధానాల కారణంగానే  వైసీపీ కార్యకర్తలకు  ప్రభుత్వాన్ని  నిలదీసే నైతిక ధైర్యం కరువైంది . ​జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తంతు సక్రమంగా జరగడం లేదు కాబట్టి పోలింగ్ మళ్లీ జరగాలన్నారు. కానీ పులివెందులలో కూడా యాభై శాతానికి పైబడిన ఓటింగ్ నమోదయింది. జగన్ ఒకవైపు ఆర్భాటం చేస్తూ ఉండగానే జనం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ ఎప్పుడూ ఎలా జరుగుతుందో ఈ పర్యాయం కూడా అదే మాదిరిగా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చోట్లా రికార్డెడ్ గానే పోలింగ్ జరిపించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో న్యాయస్థానాలు కూడా వైసీపీ రీపోలింగ్ పిటిషన్లను డిస్మిస్ చేశాయి.

ఇక పులివెందుల విషయానికి వస్తే.. జగన్ ధర్నా చేస్తున్న సమయంలోనూ పులివెందుల ప్రజలు ఆయనను పట్టించుకోకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లి పోయారు.  జగన్ పులివెందుల కోట బద్దలు కావడం ఆయన రాజకీయ భవిష్యత్ విషయంలో ఇస్తున్న సంకేతాలేమిటన్నదానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలకు చేస్తున్నారు. వాటిలో ఏ విశ్లేషణా కూడా జగన్ కు ఇసుమంతైనా ఊరడింపు కలిగించేలా లేదు. 

[YCP Loose Pulivendula Municipality, YS Jagan Mohan Reddy, TDP vs YCP, Andhra Pradesh Local Body Elections, YS Family Stronghold, Telugu One]