TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోనసీమలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ: మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో ఘోర పరాజయం.!

Published on: Wed Nov 11, 2026 1:20PM

కోనసీమ జిల్లాలో వైసీపీ మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది ఆ పార్టీలో నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి.  2019 ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ , తాజా స్థానిక సమరంలో చతికిల పడింది.  కోనసీమ వ్యాప్తంగా అధికార  తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇందుకు వైసీపీ నేతలలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. 

రామచంద్రాపురం పురపాలక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. వైసీపీ తరఫున పోటీ చేసిన చైర్‌పర్సన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తన ఓటమికి సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడు సూర్యప్రకాష్‌  కారణమంటూ బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఎవరూ నమ్మవద్దంటూ ఆయన ఒక వీడియో విడుదల చేయడం పార్టీలో నెలకొన్న  సమన్వయ లోపాన్ని బట్టబయలు చేసింది.

మరోవైపు అమలాపురం మున్సిపాలిటీలోనూ వైసీపీకి ఘోర పరాజయం పాలైంది. అక్కడ మాజీ మంత్రి సహా పలువురు కీలక నాయకులు అందుబాటులో ఉన్నప్పటికీ, వైసీపీ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎస్సీ సామాజిక వర్గం తమ వెంటే ఉంటుందని పార్టీ గట్టిగా నమ్మినప్పటికీ, ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి.  నాయకుల మధ్య  సమన్వయం కొరవడటమే ఈ పరిస్థితికి దారితీసిందని పరిశీలకులు  అంటున్నారు.

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోనూ ఇదే తంతు పునరావృతమైంది. ఇక్కడ కూటమి అభ్యర్థి చేతిలో వైసీపీ అభ్యర్థి ఓటమిపాలవ్వగా, వైసీపీ   కొన్ని స్థానాలకే పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. బలమైన అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచే వివాదాలు తలెత్తడం, సీనియర్‌ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోవడం పార్టీని పునాదుల స్థాయిలోనే దెబ్బతీశాయంటున్నారు. 

ఇది కూడా చదవండి:  మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు

మొత్తంగా చూస్తే, కోనసీమ జిల్లాలో తెలుగుదేశం కూటమి బలం విజయానికి ఎంత కారణమో, వైసీపీ అంతర్గత విభేదాలు, ఆ పార్టీ నేతల వైఖరీ కూడా అంతే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. 

నేతల వైఖరి, వర్గపోరు వల్లే వైసీపీకి తలెత్తుకోలేనంత ఘోర పరాభవం స్థానిక పోరులో ఎదురైందని అంటున్నారు. వైసీపీ శ్రేణులు సైతం నాయకుల తీరు పట్ల, వారి ఒంటెత్తు పోకడల పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. భవిష్యత్ లో కోససీమలో పార్టీని గాడిన పెట్టాలంటే అధిష్టానం స్థానిక నేతల అంతర్గత  కలహాలపై  దృష్టి సారించి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు:  జగన్ కంచుకోటలో కూటమి జెండా.. కడపలో వైసీపీకి భారీ షాక్.!

పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. మాజీ ఎంపీలు అనురాధ, గొడ్డేటి మాధవి ఓటమి.!

[YCP Internal Fight Konaseema Defeat, Internal Conflicts, Local Body Elections, Pilli Subhash Chandra Bose, YCP Leaders Blame, Telugu One]