స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలు: వైసీపీ పిటిషన్ డిస్మిస్.. బెడిసికొట్టిన జగన్ వ్యూహం.!
Published on: Mon Oct 19, 2026 9:23AM

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో,వైసీపీకి న్యాయస్థానంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, నామినేషన్ల పర్వం ప్రారంభమైన వేళ ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపుతూ కేంద్ర బలగాలను రప్పించాలని ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను చూపిస్తూ వైసీపీ కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆ వాదనలు నిలవకపోవడంతో వైఎస్సార్సీపీ వ్యూహాలు బెడిసికొట్టాయి.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ ప్రయత్నించింది. అయితే, ఇతర రాష్ట్రాల ఉదాహరణలను ప్రస్తావించినప్పట్టికి, ఏపీలోనూ అలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్న ప్రశ్నకు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో న్యాయస్థానం వారి అభ్యర్థనను అంగీకరించలేదు.
ఈ వివాదాల కేంద్రంగా నిలిచిన పుంగనూరు ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు, కాన్వాయ్ దూసుకెళ్లిన వైనంపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరా ఫుటేజ్. ఇతర ఆధారాలను అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం ముందు ఉంచడంతో, ఘర్షణలకు ఎవరు కారణమన్న అంశంపై స్పష్టత వచ్చింది. కార్యాలయం వద్ద జరిగిన హడావుడి, రక్తం అంటించుకుని నిరసన తెలిపిన తీరు వంటి అంశాలు తెరపైకి రావడంతో వైసీపీ పరువు గంగలో కలిసినట్లైంది.

మరోవైపు . క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, ఆర్థికపరమైన అంశాలు, గత ప్రభుత్వ హయాంలోని పరిణామాలు ప్రస్తుత ఎన్నికలపై ప్రభావం చూపుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో వైసీసీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి సమయాల్లో పార్టీని నడిపించేందుకు అధిష్టానం వేస్తున్న ఎత్తుగడలు బూమరాంగ్ అవుతున్నాయనీ, పార్టీ ప్రతిష్ట పూర్తిగా మసకబారుతోందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
[YCP High Court Setback, Mithun Reddy Punganur Incident, AP Local Body Elections,YS Jagan Strategy, Central Forces AP High Court, Telugu One]


