జగన్ బ్యాక్ టు బెంగళూరు: వైసీపీలో కలకలం, కలవరం.!
Published on: Tue Oct 20, 2026 10:41AM

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సమరం వేడెక్కిన వేళ, వైసీపీ అధినేత జగన్ తీరు ఆ పార్టీ వర్గాల్లో కలకలానికీ, కలవరానికీ దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక, పురపాలక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం ముమ్మరంగా సాగుతున్న క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన పార్టీ అధినేత.. ఆ బాధ్యతను గాలికొదిలేసి బెంగళూరు చెక్కేయడం పట్ల వైసీపీ క్యాడర్, లీడర్ లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం కూటమి అరాచకంగా వ్యవహరిస్తోందనీ, స్థానక సమరంలో తమ పార్టీ వారిని నామినేషన్లు కూడా దాఖలు చేయనీయకుండా దాడులకు పాల్పడుతోందనీ, ఆదివారం (అక్టోబర్ 18)న రాష్ట్రంలో రచ్చ రచ్చ చేసి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ గగ్గోలు పెట్టిన జగన్, తెల్లవారేసరికి అంటే సోమవారం (అక్టోబర్ 19) బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి పోయారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితినీ, క్యాడర్ ను అండగా నిలవాల్సిన బాధ్యతను గాలి కొదిలేసి.. ఆయన బెంగళూరు చెక్కేయడం పట్ల వైసీపీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.
స్థానికి పోరు వేళ.. క్షేత్రస్థాయిలో అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించిన జగన్… ఆ దాడులకు వ్యతిరేకంగా పార్టీ తరఫున నిరసనలకు నాయకత్వం వహించాల్సిన జగన్.. మీ చావు మీరు చావండి.. అధికార పార్టీ దాడుల్లో దెబ్బలు తినండి, ఆ తరువాత తీరిగ్గా వచ్చి పరామర్శిస్తా అంటూ బెంగళూరుకు మకాం మార్చేయడన్ని వైసీపీ నేతలు, శ్రేణులూ జీర్ణించుకోలేకపోతున్నారు.
క్షేత్రస్థాయిలో అధికార కూటమి నేతలు పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుంటే, పార్టీ అధినాయకత్వం మాత్రం రాష్ట్రానికి దూరంగా ఉండటంపై పార్టీలో ఒక రకమైన నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ నింపింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచీ ప్రతి సెకనూ కీలకమైనదిగా భావిస్తారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.

పలు స్థానాల్లో నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై కూటమి నాయకులు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తిప్పికొట్టేందుకు అధినేత అందుబాటులో ఉండి ధైర్యం చెప్పాలని, దిశా నిర్దేశం చేస్తారని సహజంగానే ఆశిస్తారు.
అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో పోటీకి ముందే వైసీపీ చేతులెత్తేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీకి పట్టున్న కొన్ని కీలక నియోజకవర్గాల పరిధిలోని స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి అభ్యర్థులెరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు జగన్ తీరు, వైఖరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[YCP Handsup Local Body Elections, Andhra Pradesh Politics, Jagan,Bengaluru, Cadre Angry, Telugu One]


