ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు.. నామినేషన్ కార్యక్రమానికి జగన్ దూరం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడాన్ని ఆ పార్టీ స్వాగతించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు వైఎస్సార్సీపీ ఈ ప్రకటన చేసింది. శుక్రవారం ముర్ము నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అయితే ఏపీ సీఎం జగన్ ముర్ము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఏపీ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆయన ముర్ము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన వ్యక్తికి అందులోనూ మహిళకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్న వైఎస్‌ఆర్‌సీపీ 

అందుకే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు మద్దతు  ఇస్తున్నట్లు పేర్కొంది. గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా... ద్రౌపది ముర్మూకి మద్దతు తెలుపుతున్నామని పేర్కొంది.

ఇక  ఇప్పటికే ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సైతం ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. తాజాగా వైఎస్సార్సీపీ సైతం మద్దతు ప్రకటించడంతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే అవుతుంది.