TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.!

Published on: Thu Nov 5, 2026 11:34AM

ఆంధ్రప్రదేశ్‌లో  జరుగుతున్న పరిషత్ ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది.   సరిగ్గా పోలింగ్ మొదలయ్యే తరుణంలో   కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  

ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్ జరుగుతున్న సమయంలో అభ్యర్థులు స్వయంగా ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం  సృష్టించింది. విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న తరుణంలో, ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్న సమయంలో అభ్యర్థులు అర్ధంతరంగా వెనకడుగు వేయడం ఆ పార్టీ నాయకత్వానికి   సవాల్‌గా మారింది.

ఈ రెండు ప్రాంతాల్లోనూ ఇంతకుముందు నుంచి ప్రచార పర్వం హోరాహోరీగా సాగింది. ప్రధాన పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్న నేపధ్యంలో, వైకాపా అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం ప్రత్యర్థి కూటమి పార్టీలలో జోష్ నింపింది.  

అభ్యర్థులు విడుదల చేసిన అధికారిక ప్రకటనల ప్రకారం, వారు ఈ నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులను వివరించినప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. పార్టీ అంతర్గత సమన్వయ లోపం కారణంగానే వీరు వైదొలగినట్లు చెబుతున్నారు. అలాగే ఎటూ విజయం సాధించే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చి పోటీ నుంచి తప్పుకుని ఉంటారంటున్నారు. కొందరైతే.. అధికార పార్టీ  నుంచి ఎదురైన ఒత్తిళ్ల ప్రభావం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇటువంటి నిర్ణయాలు పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  


[YSRCP Candidates Drop Out ZPTC Election, Mydukur Chinnamandem, Kadapa, Satyasai Districts, AP Parishad Elections, AP Politics, TeluguOne]