TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా విద్యార్థులకు చైనా ఆహ్వానం: అమెరికాతో చెలిమి దిశగా ముందడుగు.!

Published on: Sun Sep 27, 2026 9:43AM

అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య సంబంధాల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా యువతను తమ దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఐదేళ్లలో లక్ష మంది అమెరికా యువతను చైనాలో పర్యటించేందుకు వెల్ కమ్ చెప్పారు.  విద్య,  సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకే ఈ ఆహ్వానమని పేర్కొన్న ఆయన.. ఇది, అమెరికా, చైనా  మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుందన్నారు.

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో జిన్‌పింగ్ అమెరికా విద్యార్థులను చైనాకు ఆహ్వానిస్తూ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఇరు దేశాల మధ్యా ఉన్న అంతరాలు సమసిపోయే దిశగా వేసిన ముందడుగుగా అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 , చైనా-అమెరికా సంబంధాలు బలోపేతం కావాలన్ ఆశ ప్రజల్లోనే నిక్షిప్తమై ఉందని, వాటి భవిష్యత్తు   యువత చేతుల్లోనే ఉందని జిన్ పింగ్ అన్నారు.   2023లో ప్రకటించిన 50 వేల మంది యువత ఆహ్వాన లక్ష్యం, నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తయిందని వెల్లడించారు. ఆ స్ఫూర్తితోనే రాబోయే ఐదేళ్లలో విద్యా మార్పిడి, పర్యటనల నిమిత్తం  లక్ష మంది యువ అమెరికన్లను చైనాకు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు.

 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనా, అమెరికా ప్రజలు ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా భుజం భుజం కలిపి పోరాడిన విషయాన్నిఈ సందర్బంగా  జిన్‌పింగ్ గుర్తు చేశారు. చరిత్రలోని ఆ సువర్ణాధ్యాయాన్ని ఇరు దేశాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్న ఆయన..   ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, చారిత్రక చొరవను ప్రదర్శిస్తూ.. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ భావాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరు దేశాల సంబంధాలపై సానుకూలంగా స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనాకు అమెరికా అందించిన చారిత్రక సాయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భద్రత, అత్యాధునిక సాంకేతికత, అలాగే సూపర్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కీలక రంగాల్లో తాము తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ప్రపంచ శాంతిని, సౌభాగ్యాన్ని ప్రోత్సహించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయని, చరిత్రలో మనం కలిసికట్టుగా ఎంతో సాధించగలమనే గట్టి నమ్మకం తనకు ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో గ్లోబల్ పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

[Xi Jinping Offer, American Students, Study China, White House Meeting, Donald Trump, US China Relations]